రానున్న కాలంలో 'ఎల్‌నినో' ప్రభావం ప్రపంచంతో పాటు భారత్‌పై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2027 నాటికి ఇది మరింత బలపడి, తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు, తాగునీటి కొరత, అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. దీనికి తగినట్లుగా దేశం అప్రమత్తం కావాలని, ముఖ్యంగా ప్రజలు ముందస్తుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు:
1. నీటి సంరక్షణ: ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో, ఆఫీసుల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులను ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం.
2. వడదెబ్బ నుంచి రక్షణ: రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో అనవసరంగా బయటికి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగులు వాడటం, తరచూ మంచినీళ్లు త్రాగటం, ఓఆర్ఎస్.. కొబ్బరి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
3. బహిరంగ పనివారికీ రక్షణ: ఉపాధి హామీ కూలీలు, ఎండలో పనిచేసే కార్మికులు మధ్యాహ్న సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. యజమానులు వారికి తగిన నీడ, తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
4. ఆరోగ్య జాగ్రత్తలు: తీవ్రమైన వేడి కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
5. వ్యవసాయం - ఆహార భద్రత: పంటలపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉన్నందున.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు అందించే వ్యవసాయ సలహాలు, సూచనలను పాటిస్తూ నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించుకోవాలి.
6. అధిక వర్షాలు - వరదల ముప్పుపై అప్రమత్తత: ఎల్‌నినో కేవలం కరువును మాత్రమే కాకుండా.. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక భారీ వర్షాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
ALSO READ : అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్ పగటికలలు..
ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ విపత్తులను ముందస్తు జాగ్రత్తలతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రభుత్వాలు అందించే హెచ్చరికలను గమనిస్తూ, సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో తెలుసుకుంటూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకుంటేనే 2027 ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
