అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్‌.. తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురి? : దర్యాప్తులో సంచలన విషయాలు!

అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్‌.. తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురి? : దర్యాప్తులో సంచలన విషయాలు!

బాలీవుడ్‌లో మరోసారి గ్యాంగ్‌వార్ కలకలం రేపుతోంది. సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకుని దాడికి ప్లాన్ చేశారా? ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత చూసి వెనక్కి తగ్గిన దుండగులు.. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురిపెట్టారా? అంటే .. అవుననే టాక్ వినిపిస్తోంది.  లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన పోలీసుల దర్యాప్తు వివరాలు బాలీవుడ్‌లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

దర్యాప్తులో సంచలనాలు..

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు ఢిల్లీ పోలీసులకు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తొలుత ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద కాల్పులు జరపాలని ప్రణాళిక రూపొందించుకున్నారట. అయితే అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. అనంతరం టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వివరాలన్నింటినీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

టైగర్ కారుపై కాల్పులు..

అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌కు చెందిన కారుపై బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ALSO READ : రిలీజ్‌కు ముందే 'రామాయణ' కు భారీ క్రేజ్..

సల్మాన్ నివాసం వద్ద హై అలర్ట్..

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సల్మాన్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పెట్రోలింగ్ వాహనాలతో పరిసరాల్లో నిఘా పెంచారు. ఇదిలా ఉండగా, బిష్ణోయ్ సమాజానికి సల్మాన్ క్షమాపణ చెప్పి వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆ గ్యాంగ్ కు చెందిన దేవేంద్ర బుడియా చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది .  టైగర్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పుల ఘటనతో ఈ వ్యవహారం ఇప్పుడు సల్మాన్ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. అయితే నిందితుల వాంగ్మూలాలు, దాడుల వెనుక అసలు కారణాలు పోలీసుల అధికారిక నిర్ధారణ తర్వాతే స్పష్టత రానుంది.