యూఎల్సీ భూముల రెగ్యులరైజ్!శాశ్వత హక్కులు కల్పించేందుకు సర్కారు యోచన

యూఎల్సీ భూముల రెగ్యులరైజ్!శాశ్వత హక్కులు కల్పించేందుకు సర్కారు యోచన
  • యూఎల్సీ భూముల రెగ్యులరైజ్!
  • శాశ్వత హక్కులు కల్పించేందుకు సర్కారు యోచన
  • సీలింగ్ డిక్లరేషన్ సక్రమంగా పూర్తికాక ‘22-ఏ’ పరిధిలోకి చేరిన వేలాది ఆస్తులు
  • హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌, వరంగల్‌‌‌‌ పరిధిలో 
  • వేల ఎకరాలు.. ఇంకా భారీగా దరఖాస్తులు పెండింగ్‌‌‌‌
  • డిజిటల్ సర్వేతో ‘భూధార్‌‌‌‌’.. ‘భూభారతి’ ద్వారా పారదర్శకంగా పట్టాలు

హైదరాబాద్, వెలుగు:  అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) పరిధిలోని భూముల్లో ఏండ్ల నుంచి నివాసముంటున్న లక్షలాది మంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్దిష్ట పరిమితికి మించి ఉన్న మిగులు స్థలాలను పేదలకు కేటాయించేందుకు గతంలో 1976 నాటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములే ఈ ‘యూఎల్సీ’ భూములు. అయితే, దశాబ్దాల క్రితం సీలింగ్ డిక్లరేషన్ సక్రమంగా పూర్తికాకపోవడం, రిజిస్ట్రేషన్లు లేని థర్డ్ పార్టీ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం వేలాది నివాసాలు, కాలనీలు తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నాయి. రిజిస్ట్రేషన్ల చట్టంలోని ‘సెక్షన్ 22-ఏ’ (నిషేధిత జాబితా) పరిధిలోకి ఈ భూములు వెళ్లిపోవడంతో క్రయవిక్రయాలు జరగక, నిర్మాణ అనుమతులు రాక, బ్యాంకు రుణాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, సమగ్ర విధానపరమైన నిర్ణయం ద్వారా భూములను క్రమబద్ధీకరించి బాధితులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.  


భారీ విస్తీర్ణంలో యూఎల్సీ మిగులు భూములు 


గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన అర్బన్ అగ్లోమరేషన్‌‌‌‌ల పరిధిలో భారీ విస్తీర్ణంలో యూఎల్సీ మిగులు భూములు ఉన్నట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ పరిధిలో మొత్తం 879 కేసుల్లో ఏకంగా 87,11,823 చదరపు మీటర్ల (సుమారు 2,152.22 ఎకరాలు) భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.

ఇందులో అత్యధికంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోనే 640 కేసుల పరిధిలో 50,69,215 చదరపు మీటర్లు (1,252.64 ఎకరాలు) ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 118 కేసుల్లో 28,46,860 చదరపు మీటర్ల (703 ఎకరాలు) విస్తీర్ణం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో 121 కేసులకు సంబంధించి 3,83,586 చదరపు మీటర్లు (94.78 ఎకరాలు), వరంగల్ అర్బన్ పరిధిలో 4,12,160 చదరపు మీటర్ల (101.80 ఎకరాలు) భూమి ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విస్తీర్ణంలో ఇప్పటికే పెద్దఎత్తున రోడ్లు, మౌలిక వసతులు, నివాస గృహాలు వెలిసి వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు యంత్రాంగం నివేదించింది.


వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్..


గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ద్వారా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టినప్పటికీ, వేల సంఖ్యలో దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాకుండా పెండింగ్‌‌‌‌లోనే మిగిలిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో జీవో ఎంఎస్ నం.455, 456, 747 కింద మొత్తం 11,388 దరఖాస్తులు రాగా, అందులో 5,809 పరిష్కారమయ్యాయి. ఇంకా 5,579 దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటికే రూ.405.32 కోట్లు వసూలు కాగా, పెండింగ్ దరఖాస్తుల ద్వారా మరో రూ.71.17 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అలాగే, హైదరాబాద్ జిల్లాలో మొత్తం 5,263 దరఖాస్తులకుగానూ 4,927 పరిష్కారమై, 336 దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉండగా, ప్రభుత్వం రూ.61.61 కోట్ల రెవెన్యూ సాధించింది. మరోవైపు ఖాళీ యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ నిమిత్తం తెచ్చిన జీవో నం.92 కింద 7,867 దరఖాస్తులు అందగా, 1,247 దరఖాస్తుదారులకు 3.16 లక్షల చదరపు గజాల విస్తీర్ణానికి కన్వేయెన్స్ డీడ్స్‌‌‌‌ జారీ చేసి రూ.89.32 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు జమచేశారు.


డిజిటల్‌‌‌‌ సర్వే.. భూధార్‌‌‌‌‌‌‌‌ నంబర్​


నిబంధనల ప్రకారం అర్హులైన ఆక్రమణదారులు, కొనుగోలుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. విస్తీర్ణాన్ని బట్టి నిర్దేశిత రుసుము (ఫీజు) వసూలు చేస్తూ ప్రభుత్వం కన్వేయెన్స్ డీడ్ (రిజిస్టర్డ్ హక్కు పత్రం) ద్వారా వీటిని క్రమబద్ధీకరిస్తుంది. గతంలో జీవో 58, 59ల ద్వారా మీసేవ పోర్టల్, మొబైల్ యాప్ ఆధారిత క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నిరభ్యంతర ప్రభుత్వ, యూఎల్సీ భూములకు పట్టాలు ఇచ్చిన తరహాలోనే పారదర్శక విధివిధానాలను రూపొందిస్తున్నారు. త్వరలోనే అమల్లోకి రానున్న ప్రత్యేక విధానంలో అర్హుల భూములను క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే చేసి, ఆధార్ లింకేజీతో పాటు ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయించి ‘భూభారతి’ పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలని యోచిస్తున్నారు. ఈ సమగ్ర రెగ్యులరైజేషన్ ప్రక్రియ ద్వారా ఏండ్ల తరబడి నిషేధిత జాబితా (22-ఏ)లో చిక్కుకున్న ఆస్తులకు విముక్తి కలగడమే కాకుండా, పేదలకు ఆస్తిపై శాశ్వత చట్టబద్ధమైన హక్కులు, ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం చేకూరనున్నది.