- ఫోన్ లేకుంటే ఆగమాగం
- పిల్లల నుంచి పెద్దలదాకా నోమో ఫోబియా
- సగటున రోజూ ఐదారు గంటలూ ఫోన్‌తోనే
- ఒక్క క్షణం కనిపించకున్నా టెన్షన్
- ముదిరితే డిప్రెషన్, యాంగ్జైటీ తప్పదంటున్న నిపుణులు
- వెంటనే వదిలించుకోవాలని సూచన
- మన రాష్ట్రంలో 70-90% మందికి సమస్య.. పలు స్టడీల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు నిద్రలేవగానే దేవుడి పటమో.. లేదంటే అమ్మానాన్నల మొఖమో చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఫోన్ చూడడం వ్యసనంగా మారిపోయింది. బ్రష్ చేస్తున్నా, బాత్రూంకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, బైక్ లేదా కార్ నడుపుతున్నా మొబైల్ ఫోన్ చూడడం అలవాటైంది. ఎంతలా అంటే.. ఒక్క క్షణం ఫోన్ కనిపించలేదంటే ప్రాణం ఆగమాగమైపోయేంతలా తయారైంది. ఫోన్ కనిపించకపోవడమేకాదు.. బ్యాటరీ చార్జింగ్ అయిపోవచ్చినా, నెట్ కాసేపు ఆగినా టెన్షన్పుడుతున్నది. దీన్నే నో మొబైల్ ఫోబియా (నోమో ఫోబియా) అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా దీని బారిన పడ్డారు. ఇది ముదిరిపోతే మానసిక, శారీరక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్ ఫోన్‌ను ఎంతలో ఉంచాలో అంతల్నే ఉంచాలని సూచిస్తున్నారు.
వాస్తవానికి ఈ నోమో ఫోబియాను 2008లోనే గుర్తించారు. బ్రిటన్‌కు చెందిన పోస్టాఫీస్ అనే సంస్థ మొబైల్ యూజర్ల ఆందోళనలపై అధ్యయనం చేసినప్పుడు తొలిసారి నోమో ఫోబియా అని పిలిచారు. ఇప్పుడు 5జీ ఇంటర్నెట్ యుగంలో.. స్మార్ట్ఫోన్ల కాలంలో అది మరింత ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసుకు వచ్చిన వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.
రోజూ ఆరు గంటలూ ఫోనే..
డిజిటల్ వినియోగానికి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది.ఒక్కో వ్యక్తి సగటున రోజూ ఆరు గంటల పాటు మొబైల్‌ను చూస్తూనే గడిపేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆన్లైన్ గేమింగ్స్, రీల్స్ కోసమే ఎక్కువ వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఆ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి పట్టణాలతో మామూలు పల్లెలకు పాకింది. ఐటీ ఉద్యోగుల్లో అయితే.. ఫియర్ఆఫ్ మిస్సింగ్ అవుట్ (ఫోమో) అనే మరో యాంగ్జైటీ కూడా విస్తరిస్తున్నదని చెబుతున్నారు. ఆఫీస్ మెయిల్స్, మెసేజ్‌లు, టీమ్స్ చాట్‌లు ఎక్కడ మిస్ అవుతామోనన్న భయంతో 24 గంటలూ స్క్రీన్‌ను అంటిపెట్టుకుని ఉంటున్నారని అంటున్నారు. పల్లెటూరి యువత సైతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కు బానిసలవుతున్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్నా, టీ కొట్టు వద్ద కూర్చున్నా తలలు వంచి ఫోన్లలోకి చూడటం సాధారణంగా మారిపోయింది.
మానసిక, శారీరక సమస్యలు
నోమోఫోబియా కేవలం మానసిక సమస్య మాత్రమే కాకుండా.. శారీరక సమస్యలకూ దారితీస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేపనిగా ఫోన్ పట్టుకుని ఉండడం వల్ల మొబైల్ మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్‌తో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతున్నదని, దాని వల్ల నిద్రలేమి సమస్య ముదురుతున్నదని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను అదే పనిగా తలొంచి చూడడం వల్ల మెడ, వెన్నుపూస దెబ్బతింటాయని చెబుతున్నారు. దానినే ‘టెక్స్ట్ నెక్’ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల సంతోషాన్ని చూసి.. తమతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురువుతున్నట్టు చెబుతున్నారు. అదే చినికిచినికి డిప్రెషన్‌లా మారి తీవ్రంగా మారిపోతున్నట్టు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు కాసేపు ఫోన్ కనిపించకుంటే అరవడం, కోపం పెంచుకోవడం, ఎదుటివాళ్లను కొట్టడం వంటివి చేస్తుంటారని పేర్కొంటున్నారు.
మీకుందా ఈ ఫోబియా?
ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్: జేబులో ఫోన్ వైబ్రేట్ కాకపోయినా, మోగినట్లే అనిపించి మాటిమాటికీ జేబు తడుముకోవడం.
బ్యాటరీ ఫోబియా: బ్యాటరీ 20% కంటే తగ్గగానే ఏదో జరిగిపోతుందన్నట్లు గాబరా పడటం, వెంటనే పవర్ బ్యాంక్ లేదా చార్జర్ కోసం వెతుక్కోవడం.
బెడ్డు మీదా ఫోనే: నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే మొబైల్ చేతిలో ఉండాల్సిందే. అర్ధరాత్రి మెలకువ వచ్చినా నోటిఫికేషన్లు చెక్ చేయడం.
ఫ్యామిలీ కన్నా ఫోనే ముఖ్యం: ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్నా, బయటకు వెళ్లి సరదాగా గడిపే టైంలోనూ చేతిలో ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉండటం.
సిగ్నల్ లేకపోతే చిరాకు: ఊళ్లకు వెళ్లినప్పుడో, లిఫ్ట్‌లో ఉన్నప్పుడో ఫోన్ సిగ్నల్ పోతుంటుంది. అలాంటి సమయంలో తీవ్రమైన అసహనం, కోపం రావడం.
సర్వేలు ఏం చెప్తున్నాయంటే..
- నోమో ఫోబియాపై పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు సర్వేలు చేశాయి. మన దేశంతో పాటు తెలంగాణలోనూ కొన్ని అధ్యయనాలు జరిగాయి. ఆ సర్వేల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
- మన దేశంలో 78 శాతం మంది నోమోఫోబియా బారిన పడ్డారు. అందులో ఎక్కువ మంది యువత, కాలేజీ స్టూడెంట్లే.
- ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాన్నే ఎక్కువ మంది దీని బారిన పడ్డారు. ఆసియన్ జర్నల్ ఆఫ్ సోషల్ హెల్త్ అండ్ బిహేవియర్ చేసిన అధ్యయనం ప్రకారం ఉత్తరాదిన 70 శాతం మందికి నోమోఫోబియా ఉంది. తెలంగాణ సహా
- దక్షిణాదిన ఇది 74 శాతంగా ఉంది.
- డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లు 81 శాతం మంది దీని బారిన పడ్డారు. మెడికల్ స్టూడెంట్లు 66 శాతం మందిలో నోమోఫోబియా ఉంది.
- ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 97 శాతం (22వేల మందిపై స్టడీ చేశారు) మందికి మైల్డ్ నుంచి సివియర్ స్థాయిలో ఈ నోమో ఫోబియా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం వంటి టూ టయర్ పట్టణాల్లోనూ గ్రౌండ్ స్టడీ చేశారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఫోన్ వినియోగం బాగా పెరిగిపోతుండడం, ఐటీ వేగంగా విస్తరిస్తుండడం వంటి కారణాలే దీనికి
- కారణమవుతున్నట్టు స్టడీ తేల్చింది.
ఇలా బయటపడదాం..
- నో- ఫోన్ జోన్స్: ఇంట్లో డైనింగ్ టేబుల్, బెడ్‌రూమ్‌లను ‘నో-ఫోన్ జోన్లు’గా పెట్టుకోవాలి. తినేటప్పుడు, పండుకునేటప్పుడు ఫోన్‌ను పక్క గదిలో పెట్టేయండి. అలారం కావాలనుకుంటే ఓ గడియారం కొనిపెట్టుకోండి.
- 20:20 రూల్: ప్రతి 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి.
- గ్రే మోడ్: ఫోన్ బ్రైట్నెస్ను బాగా తగ్గించేయండి. గ్రే మోడ్‌లోకి మారిస్తే కలర్స్ కనిపించక ఎక్కువ సేపు చూడాలనే ఆసక్తి తగ్గుతుంది.
- నో నోటిఫికేషన్స్: అనవసరమైన షాపింగ్, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లను పూర్తిగా మ్యూట్ చేసేయాలి.
- ప్రకృతిని ఆస్వాదించాలె: ఆదివారాలు లేదా సెలవులు వచ్చినప్పుడు నాలుగైదు గంటల పాటు అలా బయటకు వెళ్లాలి. ఫోన్ స్విచాఫ్ చేసి ప్రకృతిని ఆస్వాదించేలా పలు ప్లేస్‌లకు వెళ్లాలి. స్నేహితులను కలవాలి. పుస్తకాలు చదవాలి. బయట ఫీల్డ్‌లో ఆటలు ఆడాలి.
ఆనందం కోసం మొదలై.. ఆంగ్జైటీతో ఎండ్
చిన్నపిల్లలు కేవలం ఆనందం కోసం మొబైల్ ఫోన్‌ను చూస్తున్నరు. షార్ట్ రీల్స్ చూడడం వల్ల బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ విడుదలై ఆనందం పొందుతున్నరు. దాని వల్ల మళ్లీమళ్లీ కావాలనిపించి.. టాలరెన్స్ లెవెల్స్‌కు వెళ్తున్నది. ఫలితంగా ఫోన్ కాసేపు కనిపించకపోయినా అరవడం, కోపం పెంచుకోవడం, ఎదుటి వాళ్లను కొట్టడం వంటివి చేస్తున్నరు. ఒక్కోసారి పిల్లలు, పెద్దలు సహా సూసైడల్ థాట్స్ వరకు వెళ్తున్నారు. సోషల్ జడ్జిమెంట్‌పై బతకడం వల్ల తమలోనే తప్పుందన్న భావనలోకి వెళ్తున్నారు. ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్, ఫోన్ వైబ్రేషన్ సిండ్రోమ్ వంటి లక్షణాలు పెద్దల్లో కనిపిస్తున్నాయి. పిల్లలను కంట్రోల్ చేసేందుకు ముఖ్యంగా స్కూళ్లు వాట్సాప్‌లలో హోంవర్క్‌లు ఇవ్వడం మానేయాలి. ఫిజికల్‌గా చేయించాలి. మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్‌జీలో రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్వశ్చన్‌కు అడాప్ట్ అయ్యే తత్వం చాలా తక్కువగా ఉంది.
- డాక్టర్ రిషికేశ్, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్,
సూర్య పీడియాట్రిక్, సైకియాట్రిక్ కన్సల్టెంట్
