వణికిస్తున్న వైరల్ ఫీవర్స్.. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లకు రోగుల క్యూ

వణికిస్తున్న  వైరల్ ఫీవర్స్.. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లకు రోగుల క్యూ
  • గాంధీ, ఉస్మానియాలో రోజుకు 2 వేల ఓపీ
  • నిలోఫర్​లో వెయ్యి దాటిన కేసులు
  • జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు వెయ్యికి పైగా ఓపీ
  • డెంగ్యూ, మలేరియా, చికున్​ గున్యా.. 
  • నవంబర్ వరకు సీజనల్ ముప్పు
  • కేసుల వివరాలు వెల్లడించని వైద్య శాఖ 
  • ఏజెన్సీ ఏరియాల్లో అంతంతే వైద్య సేవలు
  • మిషన్లు పనిచేయవు.. సరిపడా డాక్టర్లు ఉండరు
  • డెంగ్యూ బూచీతో ప్రైవేట్ దవాఖానల దోపిడీ

హైదరాబాద్/నెట్‌‌‌‌వర్క్, వెలుగు:  రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.  ఏజెన్సీ ప్రాంతాల నుంచి మొదలుకొని పల్లెలు, పట్టణాలు, మహానగరాల దాకా  జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. ఒకవైపు నిలిచిన నీటిలో వృద్ధి చెందే దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌‌‌‌గున్యా.. మరోవైపు వాతావరణ మార్పులతో ఇన్‌‌‌‌ఫ్లుయెంజా లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ దాడి చేస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, కీలక రక్తపరీక్షల మిషన్ల కొరత వేధిస్తుండగా, గత్యంతరం లేక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదే అదనుగా పేద, మధ్యతరగతి రోగులను డెంగ్యూ, ప్లేట్‌‌‌‌ లెట్ల బూచీ చూపిస్తూ టెస్టులు, అనవసర అడ్మిషన్ల పేరిట నిలువుదోపిడీ చేస్తున్నాయి. 

హాస్పిటల్స్​లో పెరుగుతున్న ఓపీ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని ప్రధాన బోధనాసుపత్రులైన ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఈ రెండు ఆస్పత్రుల్లో ఒక్కోచోట రోజుకు సగటున 2 వేల మందికి పైగా ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. చిన్నపిల్లల ప్రధాన ఆస్పత్రి నిలోఫర్​లో నిత్యం వెయ్యికిపైగా ఓపీకి వస్తుండగా, ఇందులో ఎక్కువగా చిన్నారులు జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో చికిత్స కోసం వస్తున్నారు. ఇక జిల్లాల్లోని పెద్దాసుపత్రులు, ఏరియా దవాఖానల్లో రోజూ 900 నుంచి 1,000 ఓపీ కేసులు రికార్డవుతున్నాయి. ఈ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా సాధారణ వైరల్ ఫీవర్లేనని అధికారులు చెబుతున్నారు.. రద్దీ పెరగడంతో ఓపీ కౌంటర్లు, ఫార్మసీల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.

ఏజెన్సీలో సరిగా అందని వైద్యం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో పాటు రక్తపరీక్షల మిషన్లు మూలనపడ్డాయి.దీంతో సరైన వైద్యం అందక పేదలు దినదినగండంగా బతుకీడుస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారిగూడెం పీహెచ్‌‌‌‌సీ పరిధిలో 65 మంది డాక్టర్లకు గాను 25 మందే పనిచేస్తుండగా, 25 స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్లేట్‌‌‌‌లెట్లు, రక్తకణాల లెక్కింపునకు కీలకమైన సీబీపీ మిషన్ ఏడాది కాలంగా పనిచేయడం లేదు.  ఇటీవల తనిఖీల్లో కలెక్టర్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, సీఎస్ఆర్ నిధుల కింద తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సీహెచ్‌‌‌‌సీలో వైరల్ ఫీవర్లతో రోజూ ఓపీ 300 దాటుతున్నా.. ఏడుగురికి గాను ముగ్గురే డాక్టర్లు ఉన్నారు. ఫార్మాసిస్ట్ పోస్టు చాలాకాలంగా ఖాళీగా ఉంది. ల్యాబ్ టెస్టులు సైతం నిలిచిపోవడంతో గిరిజనులు ఉట్నూర్, ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి జిల్లా కేంద్ర జీజీహెచ్‌‌‌‌లో ఇప్పటికే 29 మలేరియా, 20 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా  లింగాల మండలం శాయంపేట చెంచుపెంటలోని 68 కుటుంబాల్లో దాదాపు ప్రతి ఇంట్లో జ్వరాల బారిన పడ్డారు. ఇక్కడ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ఏడాదిగా మూలనపడడంతో కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సర్కారు పీహెచ్‌‌‌‌సీలకు వెళ్తే కేవలం రెండు గోలీలు ఇచ్చి పంపిస్తుండటంతో నల్లమల గూడేల్లో స్వచ్ఛంద సంస్థల మెడికల్ సెంటర్లే  దిక్కవుతున్నాయని చెంచులు చెబుతున్నారు. 

ఆదిలాబాద్ రిమ్స్, భూపాలపల్లి ఏజెన్సీల్లో డయేరియా, మలేరియా, ప్లేట్‌‌‌‌లెట్లు పడిపోయిన కేసులు పెరుగుతున్నాయి. 
తూప్రాన్‌‌‌‌లో టైఫాయిడ్ కల్లోలం..

మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు నెలలోనే 992 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా ఏకంగా 288 మందికి పాజిటివ్ వచ్చింది. 120 మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా ఇద్దరికి నిర్ధారణ అయింది. ఈ ఒక్క నెలలోనే తూప్రాన్ ఆస్పత్రిలో 1,017 మంది జ్వర బాధితులు ఓపీలో చూపించుకోగా, తీవ్ర జ్వరం వల్ల 528 మంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. రామాయంపేట సీహెచ్‌‌‌‌సీకి రోజూ దాదాపు 250 మంది జ్వర బాధితులు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోజూ వెయ్యి మందికి పైగా ఓపీ వస్తుండగా, ఒక్క పిల్లల వార్డులోనే జ్వరంతో 50 మందికి పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆగస్టులో 225 జ్వరం కేసులు నమోదు కాగా, వనపర్తి జిల్లా ఆస్పత్రిలో రోజూ 800 మంది ఓపీ వస్తున్నారు. ఇటీవల వనపర్తిలో డెంగ్యూ లక్షణాలతో ఒక బాలిక మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జీజీహెచ్‌‌‌‌లో సోమవారాల్లో తాకిడి ఎక్కువగా ఉంటోంది.

అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్..

ప్రభుత్వ దవాఖానాల్లో సరిపడా డాక్టర్లు, కీలకమైన రక్తపరీక్షల వసతులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ యాజమాన్యాలు, డయాగ్నస్టిక్ సెంటర్లు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నాయి. తగినంత విశ్రాంతి, ద్రవ పదార్థాలు తీసుకుంటే రెండు మూడు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్ జ్వరాలను సైతం డెంగ్యూగా చూపిస్తూ రోగుల కుటుంబాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. డాక్టర్లు కనీసం రోగి పరిస్థితిని సరిగ్గా పరిశీలించకముందే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, డెంగ్యూ ఎలిసా, టైఫాయిడ్, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టుల పేరుతో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు దోస్తున్నారు. కొద్దిపాటి దగ్గు, ఆయాసం ఉందని చెబితే చాలు.. ఏమాత్రం అవసరం లేకపోయినా చెస్ట్​ఎక్స్‌‌‌‌రేలు, రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖరీదైన హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీటీ చెస్ట్​ స్కాన్లు రాసి దండుకుంటున్నారు. సాధారణంగా ప్లేట్‌‌‌‌లెట్ కౌంట్ 20 వేల కంటే పడిపోతేనే అత్యవసర చికిత్స అవసరం కాగా, 70 వేలు, 80 వేలు ఉన్నప్పుడే ప్రాణాపాయం ఉందంటూ భయపెట్టి అడ్మిట్ చేసుకుంటున్నారు. సాధారణ సెలైన్లు, పారాసిటమాల్‌‌‌‌ తో నయమయ్యే స్థితిలోనూ రెండు మూడు రోజులు బెడ్లపై పడుకోబెట్టి.. అనవసరమైన ఖరీదైన హైడోస్ యాంటీబయాటిక్స్, విటమిన్ డ్రిప్పులు, ఇంజెక్షన్ల పేరుతో ఫార్మసీల ద్వారా బిల్లులు పెంచేస్తూ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు లాగేస్తున్నారు.

లెక్కలు బయటకు చెప్పని వైద్యారోగ్య శాఖ.. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నప్పటికీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాత్రం రోజువారీగా నమోదవుతున్న కేసుల లెక్కలను అధికారికంగా బయటపెట్టడం లేదు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల వివరాల కోసం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ రవీంద్ర నాయక్‌‌‌‌ ను‘వెలుగు’ సంప్రదించగా ఆ డేటాను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 డేస్ ప్లాన్ లో భాగంగా ముందస్తు నివారణ చర్యలు చేపట్టామని, అలాగే ఈసారి వర్షాలు కూడా తక్కువగా ఉండటంతో సీజనల్ వ్యాధుల తీవ్రత తగ్గిందని డీపీహెచ్ చెప్పారు. కాగా అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి తీవ్రతను బట్టి చూస్తే రాజధాని హైదరాబాద్‌‌‌‌ తో పాటు ప్రధాన నగరాల్లో డెంగ్యూ కేసులు 4,000 నుంచి 5,000 పైమాటే ఉంటాయని, ఏజెన్సీలో మలేరియా కేసులు 1,000 దాటాయని  అంచనా. నిజంగా అంతా అదుపులోనే ఉంటే కేసుల వివరాలను ప్రజలకు వెల్లడించడానికి వైద్యారోగ్య శాఖ ఎందుకు వెనకాడుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సెల్ఫ్ మెడికేషన్ వద్దు..

చిన్నపాటి జ్వరం రాగానే మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్స్ వాడటం ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాల్లో పెయిన్ కిల్లర్లు వాడితే కడుపులో గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అవుతుంది. సాధారణంగా వైరల్ జ్వరాలు సెల్ఫ్ లిమిటింగ్ స్వభావం కలవి కాబట్టి సరైన విశ్రాంతి తీసుకుంటే రెండు మూడు రోజుల్లో వాటంతట అవే తగ్గుతాయి. ఈ సమయంలో ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గంజి, వేడి సూపుల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వాంతులు అవుతున్నా వెంటనే  డాక్టర్‌‌‌‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.