30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు మొదటి దశను 2026 ఆగస్టు 31న జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చి స్వాగతించారు.  

శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. నల్లమల కొండలను చీల్చుకుని కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర జలాలను సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులపై స్వయంగా చల్లారు. అక్విడెక్టు వద్ద రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్విచ్ నొక్కి జలాలను దిగువకు వదిలారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు..  1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత  మొదటి దశను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.   వెలిగొండ బంగారు కొండ అవుతుందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన అభివర్ణించారు.

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం అన్నారు. కేవలం 48 రోజుల్లో 6 వేల 206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామని, అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించామని చెప్పారు.

 10 వేల200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు 7 వేల 983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తయ్యాయని, తొలిదశలో నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలిస్తామని తెలిపారు. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు.

2028లో రెండో దశ.. మార్కాపురంలోనూ కృష్ణా పుష్కరాలు

వెలిగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో 19 వందల కోట్ల రూపాయలు పనులు చేయాల్సి ఉందని, ఫేజ్-2ను 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని ఆయన అన్నారు.