- నేడు సర్పంచులు, ఉప సర్పంచులతో కమిషనర్ కీలక భేటీ
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో నిధుల నిర్వహణకు సంబంధించి సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య తరచూ వివాదాలకు కారణమవుతున్న జాయింట్ చెక్ పవర్ అంశంపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సాధకబాధకాలను స్వయంగా తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రెండు విడతలుగా ప్రజాప్రతినిధులతో అధికారులు చర్చలు జరపనున్నారు. ఉదయం 11:00 గంటలకు ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన సర్పంచులతో సమావేశం జరుగుతుంది.
మధ్యాహ్నం 3:00 గంటలకు ఇతర జిల్లాలకు చెందిన ఉప సర్పంచులతో సమావేశమై, జాయింట్ చెక్ పవర్ విధానంపై వారి అనుభవాలు, అభిప్రాయాలను నమోదు చేసుకుంటారు. ఈ సమావేశానికి గ్రామ పంచాయతీ వ్యవహారాలపై పూర్తి అవగాహన, చొరవ ఉన్న విద్యావంతులైన సర్పంచులు, ఉప సర్పంచులను ఎంపిక చేసి పంపాలని డీపీవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో ఎస్టీ, ఎస్సీ, మహిళలు సహా అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా జిల్లాల వారీగా నిబంధనలు ఖరారు చేశారు. ఈ సమావేశంలో వెల్లడయ్యే అభిప్రాయాల ఆధారంగా చెక్ పవర్ విధానంలో మార్పులు-చేర్పులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించే
అవకాశముంది.
