ఎంటీపీ కిట్ల అమ్మకాలపై అఫిడవిట్‌‌ ఇవ్వండి :  హైకోర్టు 

ఎంటీపీ కిట్ల అమ్మకాలపై అఫిడవిట్‌‌ ఇవ్వండి :  హైకోర్టు 
  • డాక్టర్‌‌ ప్రిస్క్రిప్షన్‌‌ లేకుండా విక్రయాలపై చర్యలేంటి?
  • ప్రస్తుత చర్యలు, భవిష్యత్‌‌ కార్యాచరణ వివరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: డాక్టర్‌‌ ప్రిస్క్రిప్షన్‌‌ లేకుండా అనధికారికంగా జరుగుతున్న మెడికల్‌‌ టెర్మినేషన్‌‌ ఆఫ్‌‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కిట్ల అమ్మకాలపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత నియంత్రణ చర్యలతోపాటు భవిష్యత్‌‌ కార్యాచరణను కూడా అందులో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఎంటీపీ కిట్ల విక్రయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ డాక్టర్‌‌ ప్రభుకుమార్‌‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. నిబంధనల ప్రకారం ఎంటీపీ కిట్లను వైద్యుల పర్యవేక్షణలోనే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. సరైన శిక్షణ లేకుండా వీటిని వాడితే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ తనిఖీల్లో 234 మెడికల్‌‌ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ప్రిస్క్రిప్షన్‌‌ లేకుండా కిట్లు లభిస్తుండటంతో అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తి మహిళల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విక్రయాల రికార్డుల నిర్వహణ, తనిఖీలు, ఆడిట్‌‌లు, ఫార్మసీల జవాబుదారీతనంపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అనధికారిక విక్రయాలను అడ్డుకునేందుకు వైద్యారోగ్యశాఖ, డ్రగ్‌‌ కంట్రోల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డీజీ తీసుకుంటున్న చర్యలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.