కెనడాలో నివసిస్తున్న 31 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అక్షయ్ సప్రా ట్రేడింగ్ వ్యసనం వల్ల ఏ విధంగా జీవితాలు సర్వనాశనం అవుతాయో కళ్లకు కడుతుంది. చిన్ననాటి ఆర్థిక ఇబ్బందులు, పేదరిక నేపథ్యం అతడిలో డబ్బే సర్వస్వమనే భావనను, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ నింపాయి. కెనడాలో స్థిరపడేందుకు తల్లిదండ్రులు పడిన కష్టాలు అతడి మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి.
కాలేజీలు చదువుకునే రోజుల్లో కెనడాలో గంజాయి చట్టబద్ధం కానుందనే వార్తలతో స్నేహితుడి మాటలు విని స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన సప్రా. గంజాయికి సంబంధించిన స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాడు. అలా తక్కువ కాలంలోనే ట్రేడింగ్‌కు బానిసయ్యాడు. లెక్చర్ హాల్స్‌లో, ఆఫీసుల్లోనూ ట్రేడింగ్ చేయడమేపనిగా పెట్టుకున్నాడు. ఒక దశలో ఉద్యోగం మానేసి ఉబెర్ డ్రైవింగ్ చేస్తూ.. పూర్తిగా ట్రేడింగ్‌కే అంకితమయ్యాడు. క్రిప్టో ట్రేడింగ్ కోసం సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ బాట్‌ను కూడా తయారుచేశాడు. లోన్లు, అప్పులు చేసి మరీ ట్రేడింగ్ కొనసాగించాడు.
కొన్ని విజయాలు అతడిలో మరింత దురాశను పెంచాయి. మెటా, ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలపై పెట్టిన బెట్లతో రూ.కోట్లు సంపాదించాడు. తొలుత రూ.3-4 లక్షల లక్ష్యంతో మొదలైన ప్రయాణం.. కోట్లకు చేరిన తర్వాత కూడా ఆగలేదు. హౌసింగ్ మార్కెట్ ధరలు, పన్నుల భారం పేరుతో ప్రతిసారీ తన టార్గెట్ పెంచుకుంటూ పోయాడు.
ALSO READ : లేస్, కుర్‌కురే, మ్యాగీ ఇష్టంగా తింటున్నారా..?
అతిగా ట్రేడింగ్ చేస్తూ చివరికి భారీ నష్టాలను మూటకట్టుకున్నాడు. బియాండ్ మీట్, స్పేస్‌ఎక్స్ షేర్లలో పెట్టిన భారీ కాల్, పుట్ ఆప్షన్ల వల్ల అక్షయ్ సప్రా భారీ మొత్తాన్ని నష్టపోయాడు. కేవలం స్పేస్‌ఎక్స్ ట్రేడింగ్‌లోనే కొన్ని వారాల్లోనే రూ.2 కోట్ల వరకు నష్టాలు మూటకట్టుకున్నాడు.
ఇంతటి ఘోర నష్టాల తర్వాత కూడా అతడిలో ట్రేడింగ్ పిచ్చి తగ్గలేదు. జూద వ్యసనం నుంచి బయటపడేందుకు 3 వారాల రిహాబ్ సెంటర్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం తన ట్రేడింగ్‌ను బహిరంగంగా రికార్డ్ చేస్తూ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధ్యతగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఘటన స్టోక్ మార్కెట్ ట్రేడింగ్ ఎంతటి ప్రమాదకర వ్యసనంగా మారుతుందో స్పష్టం చేస్తోంది.
