మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా సాగుతున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీల ఆహార పదార్థాలపై మ్యానుఫ్యాక్చరింగ్ అంక్ ఎక్స్‌పైరీ తేదీలను మార్చి అమ్ముతున్న చేసే రాకెట్‌ను అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, నవీ ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ నిర్వహించిన దాడుల్లో ఈ దారుణమైన విషయం బయటపడింది. మార్కెట్లో ప్రజాధరణ పొందిన బ్రాండ్లకు చెందిన స్నాక్స్ ప్యాకెట్లపై ఉన్న ఒరిజినల్ డేట్స్‌ను తుడిచివేసి.. కొత్త తేదీలతో స్టిక్కర్లను అతికిస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారట. గతంలోనూ ఇలా ఇతర దేశాల నుంచి కాలం చెల్లిన ఫుడ్స్ ఇలాగే మనదేశంలో అమ్ముతున్న బ్యాచ్ కూడా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
టర్బేలోని టీటీసీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న 'సాధనా ఎంటర్‌ప్రైజెస్' గోదాముపై ఆగస్ట్ 24 నుంచి 29 మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ల ఉత్పత్తులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. లేస్ చిప్స్ క్లాసిక్ సాల్టెడ్, మ్యాజిక్ మసాలా, స్పానిష్ టాంగీ టొమాటో, సిజ్లింగ్ హాట్, లెమన్ చిల్లీ వేరియంట్లు దొరికాయి. అలాగే Kurkure మసాలా మంచ్, రెడ్ చిల్లీ చటకా, నాటీ టొమాటో, సాలిడ్ మస్తీ, గ్రీన్ చట్నీ, సెజ్వాన్ చట్నీ, పఫ్‌కార్న్ యమ్మీ చీజ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మ్యాగీ మసాలా, నూడుల్స్, ఫన్ ఫ్లిప్స్, కినార్ మష్రూమ్ సూప్, రసోయ్ కర్రీ పేస్ట్‌లు, హేల్‌మాన్ మయోనేజ్ పట్టుబడ్డాయి. కేవలం స్నాక్సే కాకుండా థమ్స్ అప్, లిమ్కా వంటి శీతల పానీయాలు కూడా డేట్స్ ఆల్టర్ చేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ గోదాములో స్నాక్స్ ప్యాకెట్ల మీద ఉన్న అసలు మ్యానుఫ్యాక్చరింగ్ వివరాలను తొలగించడానికి ప్రత్యేకంగా ఇంక్‌జెట్ ప్రింటర్లు, థిన్నర్లు, స్టిక్కర్లను ఉపయోగించారు నింధితులు. తయారీలో వాడిన పదార్ధాలు, పోషకాహార విలువలకు సంబంధించి అసలు లేబుళ్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో తప్పుదారి పట్టించే కొత్త సమాచారంతో స్టిక్కర్లను అంటించారు. ముంబైతో పాటు దిల్లీ, నోయిడాకు చెందిన పలు ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ కంపెనీలు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది.
రూ. 75 లక్షలకు పైగా సరుకు సీజ్..
ఈ ఆపరేషన్‌లో అధికారులు భారీ ఎత్తున సరుకు స్వాధీనం చేసుకున్నారు. పది ఎక్స్‌పోర్టర్ కంపెనీలకు చెందిన సుమారు 8వేల 442 కార్టన్లను ఎఫ్‌డీఏ అధికారులు సీజ్ చేశారు. వీటి అధికారిక విలువ రూ.75లక్షల 21వేల 269గా ప్రకటించారు. ఇవి కాకుండా ఎలాంటి లేబుల్స్ లేని, గడువు ముగిసిన మరో రూ.30వేల 600 విలువైన ఆహార ఉత్పత్తులను కూడా గోదాము నుంచి రికవరీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ విదేశాలకు కూడా పాడైపోయిన తినుబండారాలను ఎగుమతి చేస్తున్న బయటకు రావటంతో ప్రజలు భయపడుతున్నారు.
