జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు బిగ్ షాక్: పాత తీర్పుపై NCLT బెంచ్ స్టే!

జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు బిగ్ షాక్: పాత తీర్పుపై NCLT బెంచ్ స్టే!

జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత దివాలా కేసుకు సంబంధించి ఆగస్టు 25 తీర్పుపై 5 సభ్యుల ప్రత్యేక బెంచ్ స్టే విధించింది. ఆగస్ట్ 25న ట్రిబ్యునల్‌లోని చిన్న బెంచ్ ఇచ్చిన తీర్పులో స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం రాలేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై తాజాగా మరోసారి విచారణ జరపాలని నిర్ణయించి.. కేసుతో సంబంధం ఉన్న అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ స్టే ఉత్తర్వులు సుభాష్ చంద్రకు పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారాయి.

వాస్తవానికి తాను వ్యక్తిగతంగా ఎలాంటి రుణాలు తీసుకోలేదని, కేవలం గ్యారెంటార్ గా ఉండటం తాను చేసిన అతిపెద్ద తప్పంటూ సుభాష్ చంద్రా కామెంట్ చేశారు. ఇదే క్రమంలో జీ మీడియా సంస్థకు సేవలు అందిస్తున్నప్పటికీ దానికి కూడా ఎలాంటి వేతనం పొందటం లేదని ఉచితంగానే తన సేవలను అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ దివాలా, దివాలా స్మృతి సెక్షన్ 95 కింద సుభాష్ చంద్రపై వ్యక్తిగత దివాలా ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. దీనికి బదులుగా సుభాష్ చంద్ర ఒక రీపేమెంట్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. అప్పట్లో ఆమోదించిన రూ.22వేల కోట్ల క్లెయిమ్‌లకు బదులుగా కేవలం రూ.6కోట్ల 25లక్షలు మాత్రమే చెల్లిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే దివాలా ప్రక్రియ ఖర్చుల కోసం మరో రూ. 25 లక్షలు కేటాయించారు. ఈ మెుత్తానికి అసలు చెల్లించాల్సిన అప్పుకు చాలా తేడా ఉండటంతో ఈ ప్లాన్ వివాదాస్పదంగా మారింది.

ఈ ప్రణాళికను మొదట విచారించిన ఎన్సీఎల్టీ బెంచ్‌లోని ఇద్దరు సభ్యులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మద్దతు తెలిపిన రుణదాతల వరకే ప్లాన్ వర్తింపజేయాలని ఒకరు కోరగా.. రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనుసరించిన విధానంలో తీవ్ర లోపాలున్నాయంటూ మరొక సభ్యురాలు ఈ ప్లాన్‌ను పూర్తిగా తిరస్కరించారు. ఈ విభేదాల కారణంగా ఈ కేసును బదిలీ చేశారు. ఆగస్ట్ 25న మూడో సభ్యుడు ఈ ప్లాన్‌ను ఆమోదిస్తూనే.. కొంతమంది వ్యక్తుల క్లెయిమ్‌లను మినహాయించాలని తీర్పు చెప్పారు. 

సుభాష్ చంద్ర ఆస్తుల అమ్మకంపై నిషేధం..
కేసు మళ్లీ మొదటి బెంచ్ ముందుకు రావడంతో.. టెక్నికల్ మెంబర్ తిరస్కరించడం, జ్యుడిషియల్ మెంబర్ పాక్షికంగా సమర్థించడం, మూడో సభ్యుడు అందరికీ వర్తింపజేయడం వంటి భిన్న వాదనల వల్ల ఎలాంటి మెజారిటీ రాలేదని ఆగస్ట్ 31న తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాటైన ప్రెసిడెంట్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నేతృత్వంలోని 5 మంది సభ్యుల బెంచ్ ఆగస్ట్ 25 నాటి తీర్పును నిలిపివేసింది. అంతేకాకుండా సుభాష్ చంద్ర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఆస్తులను విక్రయించకుండా, ఇతరులకు బదిలీ చేయకుండా ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.