సెప్టెంబర్ నుంచి బెంగళూరులో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అక్కడ బైక్స్, ఆటోలు తిరగటానికి వీల్లేదు!

సెప్టెంబర్ నుంచి బెంగళూరులో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అక్కడ బైక్స్, ఆటోలు తిరగటానికి వీల్లేదు!

ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి, రోడ్డు సేఫ్టీని మెరుగుపరచడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లపై వాహనాల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా టూ-వీలర్లు, ప్యాసింజర్ ఆటోరిక్షాలు, వివిధ రకాల గూడ్స్ వాహనాలపై 24 గంటల పాటు లేదా పీక్ అవర్స్‌లో ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ మెుదటగా ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నారు.

ఎలక్ట్రిక్స్ సిటీ ఎలివేటెడ్ కారిడార్‌లో ఆంక్షలు:
ఐటీ హబ్ ప్రాంతమైన ఎలక్ట్రిక్స్ సిటీ ఎలివేటెడ్ కారిడార్‌లో టైట్ రూల్స్ తీసుకువచ్చారు. సెప్టెంబర్ 11 నుంచి ఇక్కడ రౌండ్-ది-క్లాక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అన్ని కేటగిరీల గూడ్స్ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిషేధించబడ్డాయి. అలాగే టూ-వీలర్లు, ప్యాసింజర్ ఆటోరిక్షాలు, త్రీ-వీలర్ గూడ్స్ ఆటోలు రోజంతా ఈ కారిడార్‌పై ప్రయాణించడానికి వీలులేదని అధికారులు స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్ట్ రోడ్ ఫ్లైఓవర్ రూల్స్:
అంతర్జాతీయ విమానాశ్రయ రహదారిపై ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌లో సంజీవ్‌నగర్ క్రాస్ నుంచి విద్యానిల్ప్ జంక్షన్ వరకు సెప్టెంబర్ 4 నుంచే ఆంక్షలు మొదలుకానున్నాయి. ఈ మార్గంలో టూ-వీలర్లు, ఆటోరిక్షాలపై 24 గంటల పాటు నిషేధం ఉంటుంది. అలాగే అన్ని రకాల గూడ్స్ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే తిరగడానికి అనుమతిస్తారు. ఈ ఫ్లైఓవర్‌పై జరిగే ప్రమాదాలను నివారించేందుకే కొత్త చర్యలు.

పీణ్యా మైసూర్ రోడ్ ఫ్లైఓవర్లపై ఆంక్షలు:
పీణ్యా ఎలివేటెడ్ కారిడార్‌లో సెప్టెంబర్ 4 నుంచి ప్యాసింజర్ ఆటోలు, త్రీ-వీలర్ గూడ్స్ ఆటోలపై రోజంతా నిషేధం ఉంటుంది. హెవీ, మీడియం గూడ్స్ వాహనాలు మాత్రం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణించకూడదు. ఇక మైసూర్ రోడ్డులోని బీజీఎస్ ఫ్లైఓవర్‌పై కూడా సరిగ్గా ఇదే పీక్ అవర్ ఆంక్షలు అమలవుతాయి. అయితే ఇక్కడ హెవీ గూడ్స్ వాహనాలను మాత్రం రోజంతా పూర్తిగా నిషేధించారు.

సిల్క్ బోర్డ్ - రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్:
సిల్క్ బోర్డ్ నుంచి రాగిగుడ్డ మధ్య ఉన్న కొత్త డబుల్-డెక్కర్ ఫ్లైఓవర్‌పై సెప్టెంబర్ 4 నుంచి భారీ గూడ్స్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఫ్లైఓవర్ల డిజైన్, వెడల్పు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ జామ్, ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) కార్తీక్ రెడ్డి తెలిపారు.

వాహనదారులకు హెచ్చరిక:
ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ మొదటగా ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఫ్లైఓవర్లపై తరచూ జరిగే వాహనాల బ్రేక్‌డౌన్లు, నెమ్మదైన ట్రాఫిక్ మూమెంట్, ప్రమాదాల ప్రభావాన్ని పోలీసులు పరిశీలిస్తారు. వీటి ఫలితాలను బట్టి భవిష్యత్తులో వీటిని కొనసాగించాలా లేదా సవరించాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. మారిన రూల్స్ ప్రకారం వాహనదారులు తమ ట్రావెల్ రూట్స్ ప్లాన్ చేసుకోవటం బెటర్.