ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది: అమెరికాలో ఇద్దరు కేరళ అమ్మాయిల హత్య

ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది: అమెరికాలో ఇద్దరు కేరళ అమ్మాయిల హత్య

మనతో ఉంటూ.. మనతోనే గడుపుతూ.. ప్రాణస్నేహితులుగా నటిస్తూ.. కడుపులో కత్తులు.. కళ్లల్లో కారం నింపుకుని తిరుగుతారు అనే దానికి ఈ ఘటన పర్ఫెక్ట్ ఉదాహరణ. ముగ్గురు మలయాళీ ఫ్రెండ్స్..  ఫ్యామిలీస్ తో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అప్పటి వరకు కసిలి సరదాగా గడిపారు. మలయాళీల సంప్రదాయ ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా చూశారు. మరుసటి రోజు చూస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కో చోట చనిపోయి ఉన్నారు. కేరళకు చెందిన ఇద్దరు మహిళల హత్యకేసు కాలిఫోర్నియాలో కలకలం రేపింది. చంపింది వాళ్ల స్నేహితురాలేనని తెలియడం షాకింగ్ విషయం. 

2026 ఆగస్టు 28 (ఇండియాలో 29) న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో జరిగింది ఈ దారుణ ఘటన. కేరళ తిస్సూర్ లోని మన్నూతికి చెందిన అంజనా హరి (35), తిరువనంతపురం కేశవదాసపురం కు చెందిన అన్నా మేరీ మాథ్యూ (40) అనే మహిళలు .. కొట్టాయంలోని మూన్నివాలుకు చెందిన  అనిలా (32)   చేతిలో ప్రాణాలు విడిచారు. ఈ కేసులో అనిలాను పోలీసులు అరెస్టు చేశారు. 

 ఇంత కుట్రనా..

కాలిఫోర్నియా పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన ఆగస్టు 28న  జరిగింది. డిక్సన్ ల్యాండింగ్ రోడ్‌లోని మిల్ క్రీక్ అపార్ట్‌మెంట్స్ పార్కింగ్ స్థలంలో ఒక బ్లూ SUV కారు ఒక మహిళను ఢీకొట్టి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అంజన, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే చనిపోయింది. అంజనను ఢీకొట్టిన ఆ బ్లూ SUV కారు సమీపంలోని ఒక బిల్డింగ్ పార్కింగ్ స్థలంలో దొరికింది. బలంగా ఢీకొట్టడంతో కారు బాగా దెబ్బతిని ఉన్నట్లు పోలీసులు చెప్పారు.  అనిల ఆ కారును నడిపినట్లు గుర్తించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అంజన మరణం గురించి సమాచారం అందుకున్న అన్నా మేరీ మాథ్యూ భర్త..  ఆమె ఫ్రెండ్ అయిన తన భార్యకు ఏమైనా అయ్యిందా అన్న ఆందోళనతో అపార్ట్‌మెంట్‌కు పరుగుతీశాడు. అతడు చేరుకునే లోపే భార్య హత్యకు గురైనట్లు తెలుసుకుని కుప్పకూలిపోయాడు. అపార్ట్‌మెంట్ లోపల కత్తిపోట్లతో అన్న మేరీ మాథ్యూ మృతదేహం కనిపించింది. మీడియా , ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, అనిల అన్న ఫ్లాట్‌లోకి ప్రవేశించి ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.

ఈ హత్యలకు గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. వీరు ముగ్గురూ మంచి స్నేహితులని, అంతకు ముందు రోజు కలిసి ఓనం వేడుకల్లో పాల్గొని, సినిమా చూశారని సమాచారం. అప్పటి దాకా కలిసి ఉన్న స్నేహితులు.. అందులోనే ఒకరు కళ్లల్లో కారం, కడుపులో కత్తులు దాచుకుని తిరుగుతందని ఆ ఇద్దరూ గుర్తించలేకపోయారు. ఉద్యోగం విషయంలో అనిల మిగతా ఇద్దరిపై కక్ష్య పెంచుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ ఇది నిజం కాదని మృతుల కటుంబ సభ్యులు అంటున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయితే గాని తెలిసేలా లేవు. 

ఉద్యోగాల కోసం వెళ్లిన స్నేహితులు..

స్కూల్ టీచర్ అయిన అంజన, 2021లో తన భర్త విజేష్, ఆరేళ్ల కుమార్తెతో కలిసి అమెరికాకు వెళ్లారు. కంప్యూటర్ టాచర్ అయిన అన్న మేరీ, తన తండ్రి 70వ పుట్టినరోజు వేడుకల కోసం కేరళను సందర్శించి ఇటీవల అమెరికాకు తిరిగి వచ్చారు. ఆమె కొట్టాయంకు చెందిన పల్లాత్ర జాకబ్‌ను వివాహం చేసుకున్నారు.  ఆమెకు 12, ఐదేళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 ఆ ఇద్దరు మహిళల మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి సురేష్ గోపి సోమవారం (ఆగస్టు 31) తెలిపారు. ఆగస్టు 30 (సోమవారం) శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్‌తో మాట్లాడానని, మృతదేహాల తరలింపునకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.  

అయితే, తదుపరి దర్యాప్తు కోసం అమెరికా అధికారులు మృతదేహాలను తమ వద్దే ఉంచుకునే అవకాశం ఉన్నందున, వాటిని ఎప్పుడు అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజు తర్వాత కాన్సులేట్ నుంచి  సమాచారం అందితే తప్ప  మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.