ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత, పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా 'అనలాగ్' అంటే కృత్రిమ లేదా పామాయిల్ వంటి పదార్థాలతో తయారు చేసిన పాల ఉత్పత్తులతో చేసే వంటకాలపై నిషేధం విధించింది.
అసలు అనలాగ్ పాల ఉత్పత్తులు అంటే సహజమైన పాలు లేదా వెన్నకు బదులుగా వనస్పతి, పామాయిల్, ఇతర కృత్రిమ కొవ్వులు, రసాయన పదార్థాలతో తయారు చేసే నకిలీ చీజ్, బట్టర్ వంటివి అన్నమాట. రెస్టారెంట్లు వాళ్ళ వంటకాల్లో ఇలాంటి అనలాగ్ పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు చెబితే వాటిని వెంటనే యాప్ నుంచి తొలగించనున్నట్లు జొమాటో స్పష్టం చేసింది. మా కస్టమర్ల ఆరోగ్యాన్ని రక్షించడమే మా ముఖ్య లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజీపడేది లేదని పేర్కొంది.
రెస్టారెంట్లకు జొమాటో కీలక ఆదేశాలు:
*రెస్టారెంట్లు తక్షణమే సహజమైన పాల ఉత్పత్తులకు మారిపోవాలి.
*ఒకవేళ ఇప్పుడే మార్పు చేయడం సాధ్యం కాకపోతే, అలాంటి అనలాగ్ వంటకాలను హోటల్ మెనూ నుంచి పూర్తిగా తొలగించాలి.
*హోటళ్లు, రెస్టారెంట్లు వాడుతున్న పదార్థాలు ఏమిటో సరిచూసుకోవడానికి సరఫరాదారుల లేబుల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ నిబంధనలను పాటించని రెస్టారెంట్లను మా జొమాటో యాప్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని జొమాటో హెచ్చరించింది. ఈ సందర్భంగా జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే మా ధ్యేయమని తెలిపారు.
హైదరాబాద్‌లో 250 ఉద్యోగాల కోత:
మరోవైపు జొమాటో సంస్థ హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ నిలిపివేసింది. గత కొద్ది నెలలుగా మా కస్టమర్ సర్వీస్ మోడల్‌లో మార్పులు చేస్తున్న నేపథ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెజారిటీ సపోర్ట్ పనులను బయటి (థర్డ్ పార్టీ) భాగస్వాములకు అవుట్‌సోర్స్ చేయడంతో.. హైదరాబాద్ ఆఫీస్ మూతపడి సుమారు 250 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయినట్లు తెలుస్తుంది.
