రాజస్థాన్‌లో ఓ కుటుంబం చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్తగా ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేను ఏకంగా పిక్నిక్ స్పాట్‌లా మార్చుకుని.. రోడ్డు మధ్యలోనే కూర్చుని భోజనాలు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
శివ్ మహేశ్వరి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ పెద్ద కుటుంబం ఎక్స్‌ప్రెస్‌వే మధ్యలో టార్పాలిన్లు, పేపర్లు పరిచి క్యూ లైన్లలో కూర్చున్నట్టు భోజనాలు చేయడం కనిపిస్తుంది. వాహనాలు వేగంగా వెళ్లే రహదారిని వారు తమ స్వంత ప్రదేశంలా భావించి హ్యాపీగా లంచ్ చేశారు. ఈ వీడియో కాస్తా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పబ్లిక్ ప్రాపర్టీపై, కనీస బాధ్యత లేకుండా ఇలా రోడ్లపైనే భోజనాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిక్ సెన్స్ లేకపోవడానికి ఇది నిదర్శనమని, ఇది ప్రజా భద్రతకు తీవ్ర ముప్పని కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి ప్రవర్తన వల్ల చెత్తాచెదారం పెరగడమే కాకుండా, పబ్లిక్ ప్లేస్‌లను ఎలా పడితే అలా వాడేస్తారనే చర్చ మొదలైంది. కుటుంబ వేడుకలు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ, పౌర బాధ్యతను మరిచి ఇలా రోడ్లపైకి ఎక్కడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
