బ్యాంక్ అకౌంట్ లేనోళ్లకు క్రెడిట్ కార్డు ఇస్తారా..? పూర్తి వివరాలు

బ్యాంక్ అకౌంట్ లేనోళ్లకు క్రెడిట్ కార్డు ఇస్తారా..? పూర్తి వివరాలు

బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇస్తారా అనే అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ పొందడానికి సంబంధిత బ్యాంకులో కచ్చితంగా ఖాతా ఉండాలనే రూల్ ఏమీ లేదు. అకౌంట్ లేకపోయినా సరే.. అనేక బ్యాంకులు అర్హులైనవారికి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. సరైన అర్హతలు, మంచి ఆదాయం ఉంటే చాలు.. ఎలాంటి బ్యాంకు అకౌంట్ లేకుండానే నేరుగా క్రెడిట్ కార్డును సొంతం చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌ను పరిశీలించే సమయంలో బ్యాంకులు ప్రధానంగా సదరు వ్యక్తి ఆదాయం, జాబ్, లోన్ చెల్లించే సామర్థ్యం, సివిల్ స్కోర్‌ను నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ బ్యాంకులు నిర్దేశించిన అర్హతలను అప్లికెంట్ కలిగి ఉంటే నిబంధనలకు లోబడి క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. ఈ క్రమంలో సమయానికి బిల్లులు చెల్లించగలమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తమ బ్యాంకులో అకౌంట్ లేకపోయినా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి.

ఒకవేళ ఎలాంటి బ్యాంకు అకౌంట్.. క్రెడిట్ హిస్టరీ లేనివారికి కూడా బ్యాంకులు చక్కటి ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. ఎఫ్‌డీ రూపంలో జమ చేసిన మొత్తం బ్యాంకుకు సెక్యూరిటీగా ఉండి.. రిస్క్‌ను తగ్గిస్తుంది. మొదటిసారిగా క్రెడిట్ కార్డు తీసుకునేవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. క్రమం తప్పకుండా వాడుతూ.. సకాలంలో బిల్లులు చెల్లిస్తే సివిల్ స్కోర్ కూడా మెరుగవుతుంది.

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వంటివి అవసరమవుతాయి. అయితే ప్రీపెయిడ్ కార్డులకు, క్రెడిట్ కార్డులకు చాలా తేడా ఉంది. ప్రీపెయిడ్ కార్డులో ముందుగా మన డబ్బు జమ చేసుకుని వాడుకుంటాం.. ఇది సివిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ క్రెడిట్ కార్డు ద్వారా పరిమితమైన అప్పును పొంది, బాధ్యతాయుతంగా వాడితే మెరుగైన క్రెడిట్ హిస్టరీ క్రియేట్ అవుతుంది. ఇది భవిష్యత్తులో లోన్స్ పొందటానికి వీలు కల్పిస్తుంది.