పెట్రోల్ కొట్టించుకునే టైంలోనే.. ఆ కారు ఫుల్ ఛార్జింగ్.. ఏంటీ నమ్మడం లేదా.. ఇదిగో సాక్ష్యం

పెట్రోల్ కొట్టించుకునే టైంలోనే.. ఆ కారు ఫుల్ ఛార్జింగ్.. ఏంటీ నమ్మడం లేదా.. ఇదిగో సాక్ష్యం

చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచాన్ని విస్మయపరిచేలా ఏకంగా 10వేల ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్ల మైలురాయిని అధిగమించి సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 28న షెంజెన్ వేదికగా ప్రారంభమైన ఈ సరికొత్త ఛార్జింగ్ స్టేషన్‌తో BYD తన అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా వందలాది నగరాలకు విస్తరించిన ఈ పవర్‌ఫుల్ నెట్‌వర్క్.. ఇప్పటివరకు ఏకంగా 18 లక్షలకు పైగా ఈవీ యూజర్లకు సేవలు అందించి చరిత్ర సృష్టించింది.

BYD తీసుకువచ్చిన ఈ 'ఫ్లాష్ ఛార్జింగ్' సిస్టమ్ ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా 1,500 కిలోవాట్లు ఛార్జింగ్ పవర్‌ను అందించే ఈ టెక్నాలజీ సాధారణ పబ్లిక్ ఛార్జర్‌ల కంటే ఎంతో వేగవంతమైనది. BYD రూపొందించిన సరికొత్త సెకండ్-జనరేషన్ బ్లేడ్ బ్యాటరీతో ఈ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో ఈవీ కార్లు కేవలం 5 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 70 శాతం వరకు.. అలాగే 9 నిమిషాల్లోనే ఏకంగా 97 శాతం వరకు ఛార్జ్ అవుతూ అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయ్. అంటే దాదాపుగా ఒక కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపే సమయంలోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతాయ్ అన్నమాట.

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత చలి వాతావరణంలో ఛార్జింగ్ చేయడం చాలా పెద్ద సమస్య. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీ కెమిస్ట్రీ దెబ్బతిని ఛార్జింగ్ స్పీడ్ పడిపోతుంది. కానీ BYD ఈ సమస్యకు అద్భుతమైన చెక్ పెట్టింది. ఎంతటి విపరీతమైన చలిలోనైనా ఈ సిస్టమ్ హై స్పీడ్ ఛార్జింగ్‌ను మెయింటైన్ చేస్తుంది. ఏకంగా మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరిపిన పరీక్షల్లోనూ..సాధారణ పరిస్థితులతో పోలిస్తే కేవలం 3 నిమిషాలు మాత్రమే అదనంగా సమయం పట్టినట్లు కంపెనీ నిరూపించింది.

ఈ ఛార్జింగ్ నెట్‌వర్క్ కేవలం BYD కార్లకే పరిమితం కాకపోవడం మరో విశేషం. దీని ద్వారా ఇప్పటివరకు 210 మిలియన్ kWh విద్యుత్ సరఫరా చేయబడింది. ఇందులో దాదాపు మూడో వంతు వినియోగదారులు ఇతర కంపెనీల ఈవీలను నడిపేవారే. అందరికీ ఈవీ యాక్సెస్ ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని డిజైన్ చేశారు. అయితే ఛార్జింగ్ వేగం మాత్రం ఆయా వాహనాల బ్యాటరీ కెపాసిటీని బట్టి మారుతుంది.

టార్గెట్ విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్న BYD, 2026 చివరి నాటికి చైనాలో ఏకంగా 20వేల ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే అంబిషియస్ టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం సగం దూరం విజయవంతంగా పూర్తి చేసిన కంపెనీ.. రాబోయే నెలల్లో మరో 10వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించే పనిలో బిజీగా ఉంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఆటోమొబైల్ మార్కెట్‌లో భవిష్యత్తు పూర్తిగా BYD చేతిలోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.