మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహబూబ్‌నగర్ నగర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో యూజీడీ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఏడాది రూ. 603 కోట్లు మంజూరయ్యాయని, ముందుగా నగరంలోని తొమ్మిది డివిజన్లలో చేపట్టే పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. విడతల వారీగా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ యూజీడీ నిర్మాణాలు చేపట్టి, రాబోయే మూడు సంవత్సరాల్లో నగరమంతా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మురుగునీటిని శుద్ధి చేయకుండా బయటకు వదలకూడదనే ఉద్దేశంతో ఎస్‌టీపీల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సీఎం ఆశీస్సులతో తాగునీటి సరఫరా, వాటర్ రిజర్వాయర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ లీటర్ల సామర్థ్యానికి అదనంగా 18 మిలియన్ లీటర్ల సామర్థ్యాన్ని పెంచుతూ 14 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతులు రాగా, ఇప్పటికే 11 రిజర్వాయర్లకు శంకుస్థాపన పూర్తయిందని చెప్పారు.
మొదటి విడతలో రూ. 200 కోట్లతో ఐఐఐటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నామని, ముడా నిధులతో రూ. 1.50 కోట్లతో ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. తనకు ఏ పదవులు రావాలన్న దానికంటే మహబూబ్‌నగర్ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ప్రజల ఆశీస్సులు, అధికారులు, జర్నలిస్టులు మేధావుల సహకారంతో నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహర్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కుంకుమార్చన మహోత్సవం
మహబూబ్ నగర్ టౌన్ : శ్రావణమాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరెన్నో నిర్వహించాలని ప్రభుత్వ విఫ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కుంకుమార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
