ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకర దాడుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన వావిలాల సుదర్శన్ ఉక్రెయిన్‌లో జరిగిన రష్యా క్షిపణి దాడిలో మృతి చెందాడు.
మంగళవారం(సెప్టెంబర్1) తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలపై రష్యా క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడి జరిగిన సమయంలోనే... తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సుదర్శన్, క్షిపణి దాడికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్వగ్రామంలో సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుదర్శన్... కుటుంబ పోషణ కోసం కేవలం నాలుగు నెలల క్రితమే ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న కూతురు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న మరో స్థానికుడు వేణు ద్వారా ఈ విషాద వార్త సుదర్శన్ కుటుంబ సభ్యులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సుదర్శన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్... బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహాన్ని రప్పించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
