- రూ.10 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రెండున్నరేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. లెక్చరర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు నెలల తరబడి జీతాలు అందక నరకం చూస్తున్నారని, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించలేక కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.
మంగళవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సంఖ్య 960 నుంచి 650కి పడిపోయిందన్నారు. ఇప్పటికే 310 కాలేజీలు మూతపడ్డాయని, పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని చెప్పారు. కాలేజీలు మూత పడడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువతపైనే ప్రభావం ఎక్కువగా పడుతున్నదన్నారు.
చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు పరిమితంగా ఉండడంతో ప్రైవేట్ కళాశాలలే పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్కు అని పేర్కొన్నారు. ఒక కాలేజీ మూతపడటం అంటే ఆ ప్రాంతంలోని వందలాది, వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య దూరం కావడమేనని ఆయన పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ భరోసాగా నిలిచిందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉంటే, ఆ బకాయిలు చెల్లించి పథకాన్ని కొనసాగించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ రూ.10 వేల కోట్లు బకాయి పెట్టిందని ఆరోపించారు. ఇది కేవలం ప్రైవేట్ కాలేజీల సమస్య కాదని, విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకులు, సిబ్బంది మనుగడకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయన్నారు. కష్టపడి చదువుకున్నా సర్టిఫికెట్లు చేతికి రాక.. అటు ఉద్యోగాలకు, ఇటు పై చదువులకు వెళ్లలేక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
