తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన క్రిమినల్ వేస్ట్ అని, ఇది శతాబ్దపు అతిపెద్ద మోసమని ఆయన అభివర్ణించారు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామన్న కాంగ్రెస్ నేతలు, గత వెయ్యి రోజులుగా ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఢిల్లీ ముందు మోకరిల్లిన సన్నాసుల పాలన సాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో కళకళలాడిన తెలంగాణ నేడు రైతులు, నిరుద్యోగులు, మహిళల రోదనలతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వెయ్యి రోజుల్లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు.
రైతులను జైళ్లలో పెడుతున్నారని, కాలర్ ఎగరేసిన అన్నదాతలను కాళ్లు మొక్కేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బీమా, రైతు బంధు అందించామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టి రాహుల్ బంధు నడుపుతోందని ఎద్దేవా చేశారు.
ALSO READ : రెండున్నరేండ్ల నుంచి ఫీజు బకాయిలు పెండింగ్..
మోటార్లకు మీటర్లు పెట్టేందుకే కొత్తగా రైతు డిస్కం తెస్తున్నారని, చంద్రబాబు నీటి దోపిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇది పూర్తిగా జలద్రోహం చేస్తున్న జలగల పాలన అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
