శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు కలిగిన సంతానం. దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజున కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథిన, ఇదే రోజు రోహిణి నక్షత్రము చంద్రాయుక్తమై ఉంటుంది.
శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ధర్మ పరంగా రాజనీతి తెలిసినవాడు ధర్మ రక్షణే కర్తవ్యంగా ఎన్ని నిందలు వచ్చినా భరించినవాడు. శ్రీకృష్ణుని ప్రవర్తన అర్ధంకాని అర్జునుడికి శ్రీకృష్ణుడు రణరంగంలో గీతను భోదించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఈ గీత "భగవద్గీత" గా లోకమున ప్రసిద్ది చెందింది. ఈ గీత భోద విన్న అర్జునుడు తన అజ్ఞానం తొలగించుకొని యుద్ధం చేసి విజయం పొందాడు.
ఎప్పుడు లోకంలో ధర్మం నశించి అధర్మం వృద్ది పొందితే అప్పుడల్లా నేను అవతరిస్తానని శ్రీకృష్ణుడు 'గీత' లో ఉపదేశించాడు. శ్రీ కృష్ణుడు చేసిన ప్రతి పనిలో ఈ గీత అంతరార్దం నిలిచి ఉన్నది. దీనినే కృష్ణ తత్వం అని పండితులు చెబుతుంటారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు జగద్గురువు అయ్యారు.
ALSO READ : శ్రీకృష్ణాష్టమి పూజకు శుభముహూర్తం ,రోహిణి నక్షత్రం ఎప్పుడు
శ్రీ కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో .. దేవాలయాల దగ్గర ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం,.. కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది.
కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి రోజని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు ప్రతి ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారు.
పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు
- శ్రీ కృష్ణాష్టమి( 2026 సెప్టెంబర్ 4) రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి.
- గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజగదిలో ముగ్గులు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.
- బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలివరకు చిన్నికృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.
- శ్రీకృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి.
- కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు.
- శ్రీకృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. కన్నయ్యకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే.
- కృష్ణాష్టకమ్, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.
శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. కాబట్టి కృష్ణునికి సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్లు, పాలు, మీగడ, వంటి వాటిని నివేదించాలి.
శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావించి మినపపిండి మరియు పంచదార మిశ్రమం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. . చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది.
శ్రీకృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుడి వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా శ్రీకృష్ణునిడిని తలుస్తూ కొలుస్తూ, భజనలు చేస్తూ శ్రీకృష్ణాష్టమి రాత్రిని గడపాలి. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు.
శ్రీకృష్ణునిడిని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి, దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.
ALSO READ : కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుని జననం మానవ జీవితానికి గొప్ప సందేశం..
శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం లో బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి, ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ జన్మాష్టమి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
