కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుని జననం మానవ జీవితానికి గొప్ప సందేశం.. అర్థం.. పరమార్థం ఇదే..!

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుని జననం మానవ జీవితానికి గొప్ప సందేశం.. అర్థం.. పరమార్థం ఇదే..!

శ్రీరాముడు మధ్యాహ్నం అవతరించాడు. కానీ శ్రీకృష్ణుడు  అర్ధరాత్రి కారాగారంలో  అష్టమి తిథిన జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సర్వలోకాధిపతి తలచుకుంటే ఎక్కడైనా అవతరించగలడు.  మరి కటిక చీకటిలో, జైలులోనే ఎందుకు జన్మించాడు. దీనిలోని ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

శ్రీరాముడు..శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా భగవత్​ స్వరూపలే.  ఇద్దరూ మానవులను ఉద్దరించడానికి అవతరించిన వారే.  వీరు ఎప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టవచ్చు.  కాని త్రేతాయుగంలో శ్రీరాముడు పగలు.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో కారాగారంలో జన్మించారు.  ఇలా జన్మించడానికి చాలా ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

చీకటి .. అజ్ఞానం.. అధర్మం

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత…”

ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని శ్రీకృష్ణుడే చెప్పాడు.అందుకే చీకటిలో కృష్ణజన్మించడని పండితులు చెబుతున్నారు.  అధర్మం ఎంత పెరిగినా… చివరికి ధర్మమే వెలుగుతుంది” అనే భరోసా ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు.  రాత్రి ఎంత గాఢంగా ఉంటే..తెల్లవారుజాము అంత దగ్గరగా ఉంటుంది!

కారాగారంలో జన్మించడానికి కారణం ఇదే..

పురాణాల ప్రకారం   కారాగారం ..  మన బంధనాలకు దగ్గరగా ఉంటుంది. దేవకీ–వసుదేవులు బంధించబడిన జైలులోనే కృష్ణుడు అవతరించాడు. మనిషిని కూడా కోరికలు, భయాలు, అహంకారం, మమకారం బంధిస్తుంటాయి. అందుకే శ్రీ  కృష్ణజన్మ మనకు  గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

 “నువ్వు ఎంతటి బంధనాల్లో ఉన్నా… నేను నీకు దూరం కాదు.”నీ చీకటిలోనే వెలుగుగా వస్తాను.

అర్ధరాత్రి .. నిశ్శబ్దంగా ఉంటుంది  ప్రపంచపు శబ్దం తగ్గినప్పుడు మనస్సు ప్రశాంతమవుతుంది.  మనసులోని కోలాహలం తగ్గినప్పుడే దైవస్మరణ మరింత స్పష్టమవుతుంది.భగవంతుడు మనలో లేడని కాదు..మన ఆలోచనల శబ్దంలో ఆయనను గుర్తించలేకపోతున్నాం.

 అష్టమి .. మనస్సుకు సంకేతం

వేదాల ప్రకారం “చంద్రమా మనసో జాతః”

చంద్రుడిని మనస్సుతో అనుసంధానించే సంప్రదాయం ఉంది. ఇందులో ఒక అందమైన భక్తిభావంతో నిండి ఉంటుంది.   దేవుడి దగ్గరకు రావడానికి ముందే మనం పరిపూర్ణులం కావాల్సిన అవసరం లేదు.మనస్సు ఆస్థిరంగా ఉన్నా.. బాధల్లో ఉన్నా.. ఉన్న స్థితిలోనే కృష్ణుణ్ణి ఆరాధించాలి. 

 కృష్ణుడు రాగానే బంధనాలు విడిపోయాయి..కృష్ణుడు అవతరించగానే కారాగార ద్వారాలు తెరుచుకున్నాయి..సంకెళ్లు విడిపోయాయి..వసుదేవుడికి గోకులానికి వెళ్లే మార్గం ఏర్పడింది. ఈ ప్రక్రియలోని ఆధ్యాత్మిక రహస్యాన్ని పరిశీలిస్తే .. మన హృదయంలో  శ్రీ కృష్ణభక్తి మేల్కొంటే… అజ్ఞానం, భయం, అహంకారం అనే అంతర్గత బంధనాల నుంచి విముక్తి ప్రయాణం మొదలవుతుంది.

శ్రీ కృష్ణజన్మ మానవ జీవితానికి  భరోసా 

కృష్ణుడు వెలుగులో పుట్టలేదు.. చీకటిలో వెలుగుగా పుట్టాడు.స్వేచ్ఛలో పుట్టలేదు.. బంధనాల మధ్య విముక్తికి సంకేతంగా పుట్టాడు.అందుకే జీవితంలో ఎప్పుడైనా అంతా చీకటిగా ఉంది అనిపిస్తే నిరాశపడకండి. చీకటి ఉందంటే వెలుగు రాదని కాదు. కష్టం ఉందంటే కృష్ణుడు మనకు దూరంగా ఉన్నాడని కాదు.

 కొన్నిసార్లు మన జీవితంలోని అత్యంత చీకటి సమయంలోనే కొత్త వెలుగు మొదలవుతుంది. ఆ వెలుగు పేరే  శ్రీకృష్ణుని ధ్యానం .. ఓం నమో భగవతే వాసుదేవాయ .. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు