థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సప్లై పెంచాలి.. దేశంలో 28 కేంద్రాల్లో బొగ్గు త‌‌‌‌క్కువ

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సప్లై పెంచాలి.. దేశంలో 28  కేంద్రాల్లో బొగ్గు త‌‌‌‌క్కువ
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలో విద్యుత్  వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్  విద్యుత్  కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్  ద్వారా దేశంలోని ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థలతో బొగ్గు సరఫరాపై రివ్యూ చేశారు. 

సమావేశంలో కోల్  ఇండియా, సింగరేణితో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 28 థర్మల్  విద్యుత్  కేంద్రాల్లో త‌‌‌‌క్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయ‌‌‌‌ని, వాటికి వెంటనే బొగ్గు సరఫరా చేసి కొరత లేకుండా చూడాలని సూచించారు. బొగ్గు రవాణాను మరింత పెంచాలని ఆదేశించారు.  

సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్  జ్యోతి మాట్లాడుతూ సింగరేణి సంస్థ తనతో ఇంధన ఒప్పందం చేసుకున్న థర్మల్  విద్యుత్  కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేస్తుందని, పెరుగుతున్న విద్యుత్  అవసరాలకు అనుగుణంగా బొగ్గు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రివ్యూలో హైదరాబాద్  సింగరేణి భవన్  నుంచి పర్సనల్  డైరెక్టర్  గౌతమ్  పోట్రు, ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  బి. వెంకన్న, జనరల్  మేనేజర్  తాడబోయిన శ్రీనివాస్, కొత్తగూడెం హెడ్  ఆఫీస్  నుంచి ఆపరేషన్  డైరెక్టర్  ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్  కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌‌‌‌కు నైనీ బొగ్గు

సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి మొదటి రైల్వే  ర్యాక్  యాదాద్రి ప్లాంట్​కు చేరుకుంది. 4 వేల టన్నుల బొగ్గుతో వచ్చిన తొలి రైల్ ను టీజీ జెన్‌‌‌‌కో డైరెక్టర్లు బి.నాగ్య, వై.రాజశేఖర్ రెడ్డి స్వాగతించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైనీ బ్లాక్  నుంచి వచ్చిన నాణ్యత కలిగిన బొగ్గు రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు పూర్తి కెపాసిటీతో విద్యుత్  ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. బొగ్గు నాణ్యత, ఎక్కువ వేడి ఇచ్చే సామర్థ్యం కారణంగా బాయిలర్ల పనితీరు మెరుగవుతుందని, బూడిద సమస్యను ఉండదని, రవాణా భారం తక్కువగా ఉంటుందని తెలిపారు. 

జెన్‌‌‌‌కో, సింగరేణి, భారతీయ రైల్వే మధ్య సమన్వయంతో నైనీ మైన్  నుంచి నిరంతరాయంగా బొగ్గు ర్యాక్​ల ద్వారా వైటీపీఎస్ కు బొగ్గు సప్లై అవుతుందని చెప్పారు. చీఫ్  ఇంజనీర్లు శ్రీనివాస్​రావు, సురేశ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.