ఎమ్మెల్యేలకు..రెండు విడతల్లో సీడీపీ ఫండ్స్!..ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు

ఎమ్మెల్యేలకు..రెండు విడతల్లో సీడీపీ ఫండ్స్!..ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు
  • రెండేండ్లుగా నిలిచిపోయిన  రూ.1,600 కోట్లు
  • నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ఎఫెక్ట్​
  • ఇటీవల సీఎం దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యేలు 
  • రేవంత్​ ఆదేశాలతో నిధుల విడుదలకు అధికారుల కసరత్తు 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలకు కొంతకాలంగా నిలిచిపోయిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) నిధులను విడుదల చేయాలని ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండేండ్లుగా  రూ.1,600 కోట్ల సీడీపీ నిధులను సర్కారు విడుదల చేయలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 

ఎమ్మెల్యేలు పర్యటనలకు వెళ్లినప్పుడు గ్రామాలు, పట్టణాల్లో వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నా ఫండ్స్​లేక ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చి, నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఒకే విడతలో చెల్లిస్తే ఖజానాపై భారం పడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో రెండు విడతల్లో  చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున.. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యేటా రూ.5 కోట్ల చొప్పున సీడీపీ నిధులను కేటాయించాల్సి ఉంది.  ఎమ్మెల్యే సిఫార్సు చేసిన అభివృద్ధి పనులను నిబంధనల ప్రకారం అధికారులు  ఖర్చు చేయాల్సి ఉంటుంది. శాసనమండలి నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీలకు సైతం  ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున సీడీపీ నిధులను కేటాయిస్తారు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఈ నిధులు విడుదలైతే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశముంది. ప్రధానంగా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో రిపేర్లు, తాగునీరు, విద్యుద్దీకరణ వంటి పనులు  యుద్ధప్రాతిపదికన చేపట్టే వీలు కలుగుతుంది. వర్షాకాలంలో దెబ్బతిన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చించే చాన్స్​ ఉంది. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, యువత కోసం డిజిటల్, పబ్లిక్ లైబ్రరీల ఏర్పాటు వంటి పనులకు త్వరలోనే మోక్షం లభించనుంది.

రెండేండ్లుగా పైసా ఇయ్యలే.. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో రెండేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. 2024–25, 2025–26   బడ్జెట్లలో నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్​ కింద కేటాయింపులు చూపించినప్పటికీ, వివిధ సమస్యల కారణంగా విడుదల చేయలేదు. దీంతో రెండేండ్లలో సుమారు రూ.1,600 కోట్ల నిధులు నిలిచిపోయి, అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు మొరపెట్టుకుంటున్నా కొత్త పనులకు మోక్షం లభించడంలేదు. 

అడపాదడపా ఈజీఎస్​కిందే గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీడీపీ నిధులు విడుదల చేస్తే ఆగిన అభివృద్ధి పనులతో పాటు కొత్త పనులు ప్రారంభించే  చాన్స్​ ఉందని ఎమ్మెల్యేల్లో హర్షం వ్యక్తమవుతోంది.