దశాబ్దాల ప్రస్థానం..కాలం మారుతున్నా తగ్గని ఆదరణ..కొత్తరైళ్లు వచ్చినా ఇంకా క్రేజ్.. లక్షలాది మంది ప్రయాణికులతో ప్రత్యేక అనుబంధం..అన్నింటికి మించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వరుడి భక్తుల సేవలో తరిస్తున్న రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్..49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ..
తిరుపతి..తిరుమల..ఈ పేరు వినగానే భక్తుల మదిలో మొదట మెదిలేది ఏడుకొండలవాడు శ్రీ వేంకటేశ్వర స్వామి. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు రైళ్లు, బస్సులు, కార్లలో తిరుపతికి చేరుకుని... అక్కడి నుంచి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే దాదాపు అర్ధ శతాబ్దకాలంగా లక్షలాది మంది ప్రయాణికులతో పాటు, శ్రీవారి భక్తులను కూడా తిరుపతికి చేరుస్తున్న ఓ రైలుకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. 1977లో పట్టాలెక్కిన ఈ రైలు విజయవంతంగా 49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. తరాలు మారినా,కొత్త రైళ్లు వచ్చినా, ప్రయాణికుల్లో మాత్రం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ఆదరణ తగ్గలేదు.
49 ఏళ్ల ప్రయాణం..50వ వసంతంలోకి అడుగు
లక్షలాది ప్రయాణికుల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం.. ఇదీ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రస్థానం..తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు... రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విశేష ఆదరణ పొందిన ఈ రైలు, విజయవంతంగా 49 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టి అరుదైన మైలురాయిని చేరుకుంది. కేవలం ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చే రైలుగానే కాకుండా... ప్రాంతాల మధ్య అనుబంధాన్ని పెంచిన ఆత్మీయ వారధిగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రస్థానం 1977లో ప్రారంభమైంది. ఇప్పటిలా ఆధునిక రవాణా సౌకర్యాలు విస్తృతంగా అందుబాటులో లేని కాలమది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు రైళ్లే ప్రధాన ఆధారం. అలాంటి సమయంలో పట్టాలపై పరుగులు ప్రారంభించిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్..అనతి కాలంలోనే ప్రజలకు చేరువైంది. ప్రయాణికుల రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కాలక్రమంలో ఈ రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పాతకాలపు ఇంజిన్ల నుంచి నేటి ఆధునిక విద్యుత్ ఇంజిన్ల వరకు, రైల్వే వ్యవస్థలో వచ్చిన ఎన్నో సాంకేతిక మార్పులకు సాక్షిగా నిలుస్తూ దాదాపు ఐదు దశాబ్దాలుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ALSO READ : తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని తెలంగాణలోని నిజామాబాద్‌తో అనుసంధానిస్తూ సుదీర్ఘ మార్గంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. తన ప్రయాణంలో అనేక ముఖ్యమైన పట్టణాలు, నగరాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రయాణికులకు అత్యంత కీలకమైన రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఉద్యోగులు,విద్యార్థులు,వ్యాపారులు,సామాన్య ప్రయాణికులు..ఇలా అన్ని వర్గాల ప్రజలతో ఈ రైలుకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఎంతోమందికి ఇది కేవలం ఒక రైలు కాదు, ఎన్నో ప్రయాణాలు,ఎన్నో పరిచయాలు,ఎన్నో అనుభూతులు,మరెన్నో తీపి జ్ఞాపకాలతో ముడిపడిన ఓ సుదీర్ఘ ప్రయాణ సహచరి రాయలసీమ ఎక్స్ ప్రెస్.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ అంటే శ్రీవారి భక్తులకు ప్రత్యేక అనుబంధం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమైన ప్రయాణ సాధనంగా నిలిచింది. కుటుంబ సమేతంగా ఏడుకొండలవాడి దర్శనానికి బయలుదేరే భక్తులు, రైలు ఎక్కిన దగ్గరి నుంచి తిరుపతి చేరుకునే వరకు వెంకన్న నామస్మరణతో ప్రయాణిస్తుంటారు. గోవిందా..గోవిందా..అంటూ భక్తులు చేసే నామస్మరణతో కొన్ని సందర్భాల్లో రైలు బోగీల్లోనే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంటుంది. ఏళ్ల తరబడి ఎందరో శ్రీవారి భక్తుల తిరుమల యాత్రలో భాగమైన రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. భక్తుల జ్ఞాపకాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
కాలం మారింది... రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.అత్యాధునిక రైళ్లు పట్టాలెక్కాయి.ప్రయాణ వేగం పెరిగింది.సౌకర్యాలు మెరుగయ్యాయి.అయినా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికులకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాతల కాలం నుంచి తండ్రుల తరానికి, అక్కడి నుంచి నేటి యువతరం వరకు మూడు తరాల ప్రయాణ జ్ఞాపకాలను తనతో మోస్తూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ముందుకు సాగుతోంది. 1977 నుంచి 2026 వరకు 49 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎన్నో లక్షల మంది ప్రయాణికులు, ఎన్నో వేల మంది శ్రీవారి భక్తులు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, వీటన్నింటినీ తనతో మోస్తూ అలుపెరగకుండా పట్టాలపై పరుగులు తీస్తోంది రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.
49ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ..ప్రయాణికులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ..రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలతో సేవలు అందించాలని, అర్ధశతాబ్దానికి చేరువైన ఈ రైలు ప్రస్థానం..శత వసంతాల దిశగా విజయవంతంగా కొనసాగాలని ఆశిద్దాం.
