అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండటంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దింతో ఈరోజు (సెప్టెంబర్ 2, బుధవారం) ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లు (0.98%) నష్టపోయి 76,193 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 235 పాయింట్లు (0.98%) పడిపోయి 23,820 స్థాయికి పడిపోయింది. కేవలం పెద్ద కంపెనీలే కాకుండా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా దాదాపు 1% పైగా నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరిగిందని తెలిపే 'ఇండియా విక్స్' ఇండెక్స్ దాదాపు 3 శాతం పెరిగింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోందనడానికి నిదర్శనం. ఇక ఐటీ (2.47%), రియల్టీ (1.97%), ఆటో (1.83%) రంగాలు భారీగా నష్టపోయాయి. అయితే ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మాత్రం పెద్దగా నష్టపోకుండా కాస్త నిలకడగా ఉన్నాయి.
మార్కెట్ పతనానికి అసలు కారణాలు
అమెరికా-ఇరాన్ ఘర్షణల వల్ల ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చమురు రవాణాకు కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఇరాన్ వాణిజ్య నౌకలకు మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 5% పెరిగి 96 డాలర్లకు చేరుకుంది. ఇది భారతదేశ దిగుమతుల భారాన్ని పెంచడంతో పాటు, దేశంలో ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదల) పెంచుతుందనే భయాలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి. మరోవైపు అమెరికాలో బాండ్ల ఈల్డ్స్ పెరుగుతుండటం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు మరో పెద్ద ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం (జీడీపీ వృద్ధి, జీఎస్టీ వసూళ్లు బాగుండటం, విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉండటం) మన మార్కెట్‌కు ఒక రక్షణగా నిలుస్తోందని జియోజిత్ నిపుణులు తెలిపారు. అయితే, అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల వంటి సమస్యలే ప్రస్తుతానికి మార్కెట్‌ను పతనం వైపు లాగుతున్నాయని పేర్కొన్నారు.
ALSO READ : భారీగా పడిపోయిన బంగారం, వెండి !
మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు భారీ నష్టాలను కలిగించింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సుమారు రూ.5.60 లక్షల కోట్లు క్షీణించింది. దీని ఫలితంగా, ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులకు సుమారు రూ.5.60 లక్షల కోట్ల నష్టం వాటిల్లాయి.
అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ఇండిగో, ఇన్ఫోసిస్, టీసీఎస్, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. ఇండిగో 2.38 శాతం, ఇన్ఫోసిస్ 2.04 శాతం, టీసీఎస్ 1.73 శాతం, మహీంద్రా & మహీంద్రా 1.59 శాతం, ఎన్‌టీపీసీ 1.47 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.45 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.38 శాతం పడిపోయాయి.
వీటితో పాటు, ఎటర్నల్‌లో 0.92 శాతం, టాటా స్టీల్ 0.90 శాతం, ఎస్‌బిఐలో 0.75 శాతం, మారుతిలో 1.01 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 0.44 శాతం , పవర్‌గ్రిడ్‌లో 0.40 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 0.85 శాతం, ఐటిసిలో 0.49 శాతం, భారతి ఎయిర్‌టెల్‌లో 0.20 శాతం, అదానీ పోర్ట్స్‌లో 0.12 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్‌లో 0.58 శాతం క్షీణత నమోదైంది.
