ఇన్‌స్టాలో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో రూ. 5. 30 కోట్లు టోకరా

ఇన్‌స్టాలో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో రూ. 5. 30 కోట్లు టోకరా

ఆదిలాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసాన్ని పోలీసులు భగ్నం చేశారు. మొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్మకాల పేరుతో రూ. ఐదు కోట్లకు పైగా మోసం చేసిన  అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు ప్రకాశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహజన్  వెల్లడించారు.

నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్మకాల పేరుతో అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 140 మంది బాధితుల నుండి రూ. 5 కోట్ల 30 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా ఇచ్చోడకు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 2 లక్షల 18 వేలు వసూలు చేసి మోసం చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు.