అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్ (Apple) కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus) జీతం, ఆయనకు కంపెనీ ఇస్తున్న భారీ ప్యాకేజీ వివరాలు వెలువడ్డాయి. జాన్ టెర్నస్ కొత్త జీతం సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా అన్యువల్ బేసిక్ జీతాన్ని 3 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 25 కోట్లు పెంచారు.
కేవలం జీతమే కాకుండా, టెర్నస్‌కు కంపెనీ తరఫున పెద్ద ఎత్తున షేర్లు (RSUs - Restricted Stock Units) లభించనున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయనకు 55 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 460 కోట్ల విలువైన అన్యువల్ ఈక్విటీ అవార్డును ఆపిల్ బోర్డు ఆమోదించింది.
షేర్లు ఎలా వస్తాయి?
ఈ 55 మిలియన్ డాలర్లలో 75 శాతం షేర్లు ఆపిల్ కంపెనీ పర్ఫార్మెన్స్ (స్టాక్ మార్కెట్లో కంపెనీ రాబడి) ఆధారంగా వస్తాయి. మిగిలిన 25 శాతం షేర్లు ఆయన కంపెనీలో పనిచేసే కాలాన్ని బట్టి ప్రతి ఆరు నెలలకోసారి నాలుగు సంవత్సరాల పాటు విడతలవారీగా అందుతాయి. అంతేకాకుండా, 2026 సంవత్సరానికి సంబంధించి మరో 2.5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ యూనిట్లను కూడా ఆయనకు కేటాయించారు.
టిమ్ కుక్ పరిస్థితి ఏంటి
ఇంతకాలం సీఈఓగా ఉన్న టిమ్ కుక్ ఇప్పుడు 'ఎగ్జిక్యూటివ్ చైర్'గా మారుతున్నారు. సెప్టెంబర్ 26, 2026 నుంచి ఆయన వార్షిక జీతం 2 మిలియన్ డాలర్లు( 18 కోట్లు)గా ఉంటుంది. అలాగే ఆయనకు 2027 సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల ఈక్విటీ (షేర్లు) ప్యాకేజీని కేటాయించారు. ఇందులో సగం పర్ఫార్మెన్స్ ఆధారంగా, మిగిలిన సగం సమయం ఆధారంగా వర్తిస్తాయి. ఒకవేళ ఆయన పదవీ విరమణ చేసినా, నిబంధనలకు లోబడి ఈ షేర్లు ఆయనకు దక్కుతాయి.
