ఇన్వెస్ట్ తెలంగాణ - డిఫెన్స్ ఎక్స్‌పోకు రండి.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు సీఎం ఆహ్వానం

ఇన్వెస్ట్ తెలంగాణ - డిఫెన్స్ ఎక్స్‌పోకు రండి.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు సీఎం ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. సెప్టెంబర్ 2న బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. ఇందులో భాగంగా డిఫెన్స్ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు, ఎయిర్‌షో, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఈ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ ఎక్స్‌పో విజయవంతానికి త్రివిధ దళాలు, డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు మరో 750 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్‌డీఎల్ ప్రాజెక్టు కోసం నామమాత్రపు లీజుకే భూమి కేటాయిస్తున్నట్లు సీఎం వివరించారు. ఈ భేటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎంపీలు అనిల్ కుమార్ యాద‌వ్‌,  మ‌ల్లు రవి, సురేశ్ షెట్కార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌ పాల్గొన్నారు.