మీకు తెలుసా : ఆధార్ కార్డు రెండు రంగుల్లో ఇస్తారని.. ఈ రెండు ఆధార్ కార్డులకు తేడా ఏంటో తెలుసుకోండి..!

మీకు తెలుసా : ఆధార్ కార్డు రెండు రంగుల్లో ఇస్తారని.. ఈ రెండు ఆధార్ కార్డులకు తేడా ఏంటో తెలుసుకోండి..!

ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డు.  బ్యాంకు అకౌంట్  తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, ఎక్కడికైనా ప్రయాణించాలన్నా అన్నిటికీ ఒకే ఒక్క గుర్తింపు కార్డు అయినా ఆధార్  ఉపయోగపడుతుంది. అయితే, మనకు సాధారణంగా కనిపించే తెల్లటి ఆధార్ కార్డుతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 'నీలి రంగు' ఆధార్ కార్డు కూడా ఉంటుంది. వీటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు, ఆధార్‌ వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ చూద్దాం:

నీలి రంగు (బాల ఆధార్) vs సాధారణ తెల్ల ఆధార్ మధ్య తేడాలు

ఎవరికి ఇస్తారంటే 
నీలి ఆధార్ (బాల ఆధార్): 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలకు UIDAI ఈ నీలి రంగు ఆధార్ కార్డును జారీ చేస్తుంది. సాధారణ  తెల్ల ఆధార్ కార్డు 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ  ఇస్తారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన గుర్తింపు కార్డు.

బయోమెట్రిక్ వివరాలు (finger prints):

బ్లు ఆధార్: చిన్న పిల్లలకు వేలిముద్రలు, కనుపాప (Iris) గుర్తులు సరిగ్గా అభివృద్ధి చెందవు కాబట్టి వీటిని తీసుకోరు. కేవలం పిల్లల ఫోటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు తీసుకుని, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్‌తో దీనిని అనుసంధానం చేస్తారు. 5 ఏళ్లు నిండిన తర్వాత తీసే సాధారణ తెల్ల ఆధార్‌లో 10 వేళ్ల వేలిముద్రలు, కనుపాప వివరాలను రిజిస్టర్ చేస్తారు.

అప్‌డేట్ ఎప్పుడు చేయాలి?
నీలి ఆధార్: పిల్లలకి 5 ఏళ్లు నిండిన వెంటనే, అలాగే 15 ఏళ్లు వచ్చినప్పుడు తప్పకుండా వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలి. లేదంటే ఆధార్ పనిచేయకుండా పోతుంది. అప్‌డేట్ చేసిన తర్వాత ఈ నీలి కార్డు కాస్తా సాధారణ తెల్ల ఆధార్‌గా వస్తుంది.

ఆధార్‌ ఉపయోగాలు
 దేశంలో ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు  మనము భారతీయ పౌరులమని నిరూపించుకోవడానికి అధికారిక గుర్తింపు  కార్డుగా  ఆధార్ ఉపయోగపడుతుంది.  
స్కూల్  అడ్మిషన్స్: పిల్లలను స్కూళ్లలో చేర్పించేటప్పుడు, లేదా కాలేజీల్లో అడ్మిషన్ల సమయంలో ఆధార్ నంబర్ తప్పనిసరిగా అడుగుతున్నారు.

ALSO READ : స్టాక్ మార్కెట్లో వ్యసనం: రోజూ 16 గంటలు ట్రేడింగ్..

ప్రభుత్వ పథకాలు: విద్యార్థులకు అందే రకరకాల స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, వివిధ ప్రభుత్వ రాయితీలు  అందడానికి ఆధార్ చాలా అవసరం.

బ్యాంకు పనులు: పిల్లల పేరిట భవిష్యత్తు కోసం సేవింగ్స్ అకౌంట్స్ తెరవాలన్నా ఆధార్ కార్డు ఉంటేనే ఈజీగా పని పూర్తవుతుంది.

బాల ఆధార్ కోసం దరఖాస్తు చేయడం ఎలా?
*మీ సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లాలి లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా ముందే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
*అక్కడ పిల్లల జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్,  తల్లిదండ్రులలో ఒకరి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి.
*అక్కడ చిన్నారి ఫోటో తీసుకుని, ఆ వివరాలను తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ చేస్తారు.
*ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నీలి రంగు బాల ఆధార్ మీ ఇంటి అడ్రస్ కు పోస్ట్ ద్వారా వస్తుంది.
*గుర్తుంచుకోండి, 5 ఇంకా 15 సంవత్సరాల వయస్సు వచ్చే పిల్లలకు ఈ ఆధార్ ఎంట్రీ ఇంకా అప్‌డేట్ పూర్తిగా ఉచితం.