- మానకొండూరు నియోజకవర్గంలో మరోసారి కలకలం
కరీంనగర్, వెలుగు: ‘ఇదే నా చివరి మెసేజ్. నా చావుకు కారణం ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి, బెజ్జంకి ఎస్సై తిరుపతి, గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి’ అంటూ మెట్ట నాగరాజు అనే కాంగ్రెస్ కార్యకర్త ఓ వాట్సాప్ గ్రూపులో చేసిన పోస్టు మంగళవారం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన నాగరాజు ‘జెన్ జీ మానకొండూరు’ అనే వాట్సాప్ గ్రూపులో ఈ పోస్టు చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండాపోయాడు.
అనంతరం పోలీసుల సహకారంతో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్న నాగరాజును కొందరు కాంగ్రెస్ నాయకులు గుర్తించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే నాగరాజుపై ఇటీవల గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి, బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు అందినట్లు తెలిసింది.
ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉండడంతో నాగరాజు ఈ పోస్టు పెట్టినట్లు సమాచారం. అక్రమ కేసుల విషయమై గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన బేతెత్లి రాజేందర్ రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం మరవకముందే నాగరాజు పెట్టిన పోస్టు నియోజకవర్గంలో కలకలం రేపింది.
