కమిటీలతో కాలయాపన చేయొద్దు..టీచర్లు, ఎంప్లాయీస్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

కమిటీలతో కాలయాపన చేయొద్దు..టీచర్లు, ఎంప్లాయీస్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
  • ఇందిరా పార్క్‌‌‌‌ వద్ద పీఆర్‌‌‌‌టీయూ ఆధ్వర్యంలో టీచర్ల మహా ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సీపీఎస్ రద్దుతో పాటు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద పీఆర్‌‌‌‌టీయూ ఆధ్వర్యంలో ప్రభుతం ఇచ్చిన హామీల అమలు కోసం టీచర్ల మహాధర్నా నిర్వహించారు. చీఫ్ గెస్ట్​గా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.

ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం మినహా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు. మూడు డీఏలు ఇస్తామని చెప్పి, ప్రస్తుతం ఆరు డీఏలను పెండింగ్‌‌‌‌లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌‌‌‌ను రద్దు చేశాయని, తెలంగాణలో మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మెమోలు 57/4, 57/5ను అమలు చేయడంతో పాటు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మెరుగైన ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పీఆర్‌‌‌‌సీ ప్రకటించాలని, హెల్త్ స్కీమ్‌‌‌‌పై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. మే 2న సీఎం ఇచ్చిన హామీల అమలు కోసమే తాము ఈ మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 2 నాటికి పీఆర్‌‌‌‌సీ కమిషన్ నివేదిక తెప్పించి మంచి ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పీఆర్‌‌‌‌సీ అమలు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదన్నారు.  సీపీఎస్‌‌‌‌ రద్దు చేయాలని, సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో పీఆర్‌‌‌‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల  సంఘం అధ్యక్షుడు పెరి వెంకట్ రెడ్డి, ఆ సంఘం రాష్ట్ర  నేతలు వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్, టీటీ జాక్ నేతలు కటకం రమేశ్, గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.