గద్వాల, వెలుగు : మొక్కజొన్న, మిరప పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు రైతులను గద్వాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మొగులయ్య సోమవారం మీడియాకు వివరించారు. ఇటిక్యాల మండలం సెనగపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ బీసన్న అలియాస్ డగ్గు బీసన్న, మల్దకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన తనగల గోకారి అలియాస్ బోయ గోకారి తమ మొక్కజొన్న, మిరప తోటల్లో కొంతకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు.
దానిని ఎండబెట్టిన తర్వాత విక్రయించేందుకు ఆదివారం గద్వాల పట్టణానికి తీసుకొచ్చారు. అయిజ రోడ్డులో తనిఖీలు చేపట్టిన పోలీసులకు బీసన్న, గోకారి అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. 5.057 కిలోల గంజాయి దొరికింది. దీంతో గంజాయితో పాటు బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. డీఎస్పీ వెంట సీఐ టంగుటూరి శీను, గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ ఉన్నారు.
