- 30 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు
- ఈనెల 29న యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడు
గండిపేట, వెలుగు: నర్సుపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన సుమారు 30 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 21 ఏండ్ల యువతి అత్యాచారానికి గురై మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహేశ్వరం మండలం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి తన సోదరి, స్నేహితురాలితో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలోని నివాస గదుల్లో ఉంటోంది.
ఈనెల 29న ఉదయం నుంచి ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాలు కిటికీలోంచి చూడగా యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బిహార్‌కు చెందిన ఎండీ సనావుల్లా తుక్కుగూడలోని ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అతడు కొంతకాలంగా యువతిపై కన్నేసి, అర్ధరాత్రి ఆమె నివాస గదిలోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని సుమారు 30 గంటల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
