హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ సూర్య ప్రతాప్ భారతి(30 ) మృతి కేసులో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. కరోనా టైంలో నల్లగండ్ల గచ్చిబౌలిలోని ‘సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్’ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అపర్ణ విజయ్‌కుమార్ నిర్లక్ష్యం వల్లే సూర్య ప్రతాప్ చనిపోయాడని.. బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన సూర్య..2020 ఆగస్టు 17న సూర్య బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ట్రీట్‌మెంట్ కోసం సిటిజన్స్ దవాఖానలో చేర్చారు.
మెరుగైన వైద్యం అందించకపోగా.. కొవిడ్ పాజిటివ్ అంటూ కాంటినెంటల్ దవాఖానకు తరలించారు. అయితే అక్కడ టెస్టుల్లో కొవిడ్ నెగెటివ్ అని తేలింది. కానీ, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్ మెంట్ ఆలస్యం కావడంతో సూర్య 2020 ఆగస్టు 21న చనిపోయాడు. ఈ అన్యాయంపై హైదరాబాద్ ‘ఆర్‌జేఎం లా ఆఫీస్’ వ్యవస్థాపకురాలు, న్యాయవాది మంచే రాజశ్రీ బాధితుల తరఫున వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. మరోవైపు సూర్య స్నేహితులు, తోటి హెచ్‌సీయూ స్టూడెంట్స్ సైతం వ్యక్తిగత పోరాటం చేసి బాధితులకు అండగా నిలిచారు. న్యాయవాది పట్టుదల, స్నేహితుల పోరాటంతో ఆగస్టు 25న జిల్లా వినియోగదారుల కమిషన్ సూర్య తల్లిదండ్రులకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.
