వెనిజువెలాలో చైనా, రష్యా ఆధిపత్యానికి తెరపడిందా.. ఆ దేశంలోని చమురు క్షేత్రాలు, కంపెనీలపై అమెరికా ఆధిపత్యం మొదలైందా.. ఇటీవల వెనిజువెలాతో ఆయిల్ డీల్ తర్వాత ట్రంప్ చేసిన ప్రటకన ఆచరణలోకి రానుందా.. వెనుజువెలా లోని 6 చమురు క్షేత్రాలను అమెరికా కంపెనీ NABEP స్వాధీనం చేసుకోనుందని, 64 బిలియన్ బ్యారెళ్ల చమురు ఇక అమెరికాకే దక్కనున్నట్లు అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి.
వెనిజులాలో ఇప్పటివరకు 5 చైనా కంపెనీలు, ఒక రష్యా కంపెనీ నడుపుతున్న చమురు క్షేత్రాలను అమెరికా కంపెనీ స్వాధీనం చేసుకోనున్నట్లు ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాతో చేసుకున్న పెద్ద చమురు ఒప్పందంలో ఇది ఒక భాగం. ఈ పని అమెరికా మద్దతు ఉన్న నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్నర్స్ (NABEP) కంపెనీకి అప్పగించారు.
NABEP కంపెనీ గతంలో అమెరికా వ్యాపారవేత్త హ్యారీ సార్జెంట్ చేతిలో ఉండేది. ఇప్పుడు వెనిజువెలా వ్యాపారవేత్త అలెజాండ్రో బెటన్‌కోర్ట్ నడుపుతున్నారు. మొత్తం14 కొత్త కాంట్రాక్టులలో ఐదు చైనా, ఒకటి రష్యా ఆధీనంలో ఉండగా అమెరికా ఒప్పందం ప్రకారం కీలక చమురు క్షేత్రాల నుంచి చైనా, రష్యా చేజారనున్నాయి.
ప్రస్తుతం చైనా కంపెనీలు అయిన కాంకర్డ్ రిసోర్సెస్, సినోపెక్, CNPC నడుపుతున్న వెనుజువెలా ఆయిల్ క్షేత్రాలు ఇకపై అమెరికా ఆధీనంలోకి రానున్నాయి. వీటిద్వారా వెనిజులాలోని 64 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను అమెరికా పొందనుంది. అంటే దాదాపు ఇప్పటివరకు చైనాకు వెళ్తున్న చమురు ఇకపై అమెరికాకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.
