అమెరికాలో జాబ్ చేసుకుంటూ స్థిరపడాలనుకుంటున్న వేలాది విదేశీ ఇమ్మిగ్రెంట్ ఫ్యామిలీలకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మెున్నటికి మెున్న హెచ్1బి సహా ఇతర కేటగిరీ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోతే అందించే 60 రోజుల గ్రేస్ పిరియడ్ రద్దు చేయాలని ప్లాన్ చేసిన అమెరికా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటోంది. H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు అంటే భార్య లేదా భర్తకి దక్కుతున్న వర్క్ పర్మిట్ కార్యక్రమానికి స్వస్తి పలికే ఆలోచనలో అమెరికా ఉంది. ఈ నిర్ణయం చట్టంగా మారితే అక్కడ నివసిస్తున్న భారతీయ కుటుంబాలపై ఊహించని ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఒక కొత్త ప్రతిపాదనను చేర్చింది. దీని ప్రకారం హెచ్-4 డిపెండెంట్ జీవిత భాగస్వాములను జాబ్స్ చేసుకునే అర్హుల జాబితా నుంచి తొలగించాలని చూస్తున్నారు. 2015లో నాటి ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్-4 ఈఏడీ నిబంధనను వెనక్కి తీసుకోవాలని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కోరుతోంది. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ఒక లాంగ్ టర్మ్ యాక్షన్‌గా మాత్రమే ఉంది. అంటే దీని అర్థం ఇప్పుడే ఎవరి ఉద్యోగాలు పోవు.. ఎవరి వర్క్ పర్మిట్లు రద్దు కావు.
భారతీయ మహిళలపైనే తీవ్ర ప్రభావం..
ఈ ప్రతిపాదిత మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులే. యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) డేటా ప్రకారం.. అమెరికాలో అప్రూవ్ అయిన హెచ్-1బీ వీసాల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉన్నారు. అలాగే హెచ్-4 ఈఏడీ పొందుతున్న వారిలో కూడా సుమారు 93 శాతం మంది భారతీయులేనట. పైగా ఆమోదం పొందిన ఈఏడీలలో 94 శాతం మంది మహిళలే ఉన్నారని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది. గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబాలకు.. ఈ సెకండ్ ఇన్‌కమ్ చాలా కీలకంగా ఉంటూ వస్తోంది. ఈ పర్మిట్ రద్దయితే ఎంతోమంది మహిళల కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోనుంది.
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడానికి భారతీయులకు దశాబ్దాల సమయం పడుతోంది. ఈ సుదీర్ఘ కాలంలో కుటుంబం ఒకే సంపాదనపై ఆధారపడకుండా.. అర్హులైన జీవిత భాగస్వాములు స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుని సంపాదించేలా 2015లో ఈ నిబంధన తెచ్చారు. దీనివల్ల అమెరికాలో నిపుణులు ఉండిపోయేందుకు వెసులుబాటు కలిగింది. అయితే ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఈ హెచ్-4 ఈఏడీని రద్దు చేయడానికి ప్రయత్నించినా.. 2021 జనవరిలో ఆ ప్రయత్నం వెనక్కి తీసుకున్నారు.
