బిష్కెక్: పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనేందుకు చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా పీఎం మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సోమవారం భేటీ అయ్యారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, పెజెష్కియాన్ ముఖాముఖిగా భేటీ కావడం ఇదే తొలిసారి.
వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ చెప్తోందని మోదీ గుర్తుచేశారు. ఆపై ఇరాన్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. పరస్పర ప్రయోజనాలు ఉన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం, వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచడంపై చర్చించారు.
యుద్ధాన్ని కోరుకోం, ఆక్రమణను సహించం: పెజెష్కియాన్
తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. కానీ, తమపై ఎలాంటి దాడి జరిగినా దీటుగా బదులిస్తామని ఆయ న స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత వల్ల ఏ దేశానికీ ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ఎస్సీవో సదస్సులో పాల్గొనేముందు పెజెష్కియాన్ ఈ కామెంట్లు చేశారు. లారక్ ద్వీపంలోని ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఆయన అమెరికాను హెచ్చరించారు.
