హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరు నెలలకు పైగా విధులకు గైర్హాజరవుతున్న డాక్టర్ల వివరాలను తక్షణమే పంపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలు జారీ చేశారు.
అనుమతి లేకుండా విధులకు హాజరుకాని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పూర్తి వివరాలను వెంటనే తమ కార్యాలయానికి పంపించాలని రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఇన్‌స్టిట్యూషన్ల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సర్క్యులర్ విడుదల చేశారు.
నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు అందించాలి..
డీఎంఈ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఫ్యాకల్టీ సభ్యులు గత ఆరు నెలలకు పైగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించామని డీఎంఈ పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా పూర్తి వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సహా పంపించాలని స్పష్టం చేశారు. గైర్హాజరవుతున్న వారి పేరు, హోదా, విభాగం, ఏ తేదీ నుంచి విధులకు రావడం లేదనే వివరాలు తెలపాలన్నారు.
వారు ఏమైనా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం ఇచ్చారా, గతంలో ఏమైనా ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయా..? అనే పూర్తి వివరాలను పేర్కొనాలని చెప్పారు. ఈ అంశాన్ని మోస్ట్ అర్జెంట్ భావించి వెంటనే నివేదిక సమర్పించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
