వరంగల్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను విమర్శించడమే కొందరు నేతల పనిగా మారిందని విమర్శించారు. ధర్మపురి శ్రీనివాస్‍కు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‍గా రాజకీయ బిక్ష పెడితే అరవింద్ ఆ సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. బీఆర్‍ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తన సిద్టిపేట కోసం ఉమ్మడి వరంగల్‍ను ఆరు ముక్కులు చేసి సర్వనాశనం చేశాడన్నారు. గ్రేటర్ వరంగల్ ఎలక్షన్లు వస్తున్నాయనగానే హరీశ్‌రావు మళ్లీ ఇక్కడకు వచ్చి సంఘీభావాల పేరుతో రాజకీయం చేస్తున్నాడన్నారు. మాజీ సైనికులతో పాటు స్వాతంత్ర సమరయోధుల భూములను కబ్జా చేసినవారి పనిపట్టడమే '22ఏ' లక్ష్యమన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తిరిగి ఒకటో తేదీకే చెల్లించేలా చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరిన నాయిని తాము రెండున్నరేళ్లలో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.5,300 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.550 కోట్లతో శాశ్వత మంచినీటి వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు, మాజీ కార్పొరేటర్లు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బత్తిని శ్రీనివాస్, జక్కుల రవీందర్, పోతుల శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.
