హైదరాబాద్, వెలుగు: సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహణ అంశాన్ని హైకోర్టు మంగళవారం విచారించనుంది. ఈ పరీక్ష నిర్వహణకు రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పొటెన్సీ పరీక్షకు దిగువ కోర్టు ఇచ్చిన అనుమతి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది వాదించారు.
.కేసులో నమోదైన ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే దర్యాప్తు సంస్థకు ఈ పరీక్ష నిర్వహించే అధికారం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. కేసు దర్యాప్తులో భాగంగా పొటెన్సీ పరీక్ష అవసరమని కోర్టుకు తెలిపారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పీఎస్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
