హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్‌లో సీసీఈ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం తెచ్చిన ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ, యూటీఎఫ్, ఎంఎస్టీఎఫ్, టీఎస్పీటీఏ తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, గట్టు గజేందర్ తదితరులు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను కలిసి వినతిపత్రం అందించారు. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ కోసం రూ.5.57 కోట్లు ఖర్చు చేయడం కంటే, ఆ నిధులను రెమెడియల్ టీచింగ్, బోధనోపకరణాల కోసం వినియోగించాలని కోరారు. ఈ వాల్యుయేషన్ డ్యూటీలతో సింగిల్, డబుల్ టీచర్ స్కూళ్లలో బోధనకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని తెలిపారు.
ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ పేరుతో అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ. వెంకట్ చెప్పారు. జీవో 25 సవరణ తదితర సమస్యలపై టీచర్ల సంఘాలతో చర్చించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్త విధానంతో విద్యార్థుల్లో పరీక్షల భయం, ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయనీ ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో టీచింగ్ టైమ్ వృథా అవడంతో పాటు అభ్యసన ప్రక్రియ దెబ్బతింటుందన్నారు. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షౌకత్ అలీ, రోహిత్ నాయక్ డిమాండ్ చేశారు.
