సింగన్నగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు

సింగన్నగూడెంలో  సామూహిక గృహ ప్రవేశాలు

యాదాద్రి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలోని డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లలోకి 120 మంది లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందించడంలో గత సర్కార్ విఫలమైందన్నారు. తాము వాటిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించామన్నారు. మిగిలిన 324 ఇండ్లను త్వరలోనే అందిస్తామని తెలిపారు మున్సిపల్ చైర్‌‌పర్సన్ శ్రీవాణి-, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, హౌసింగ్ పీడీ అలివేలు, కౌన్సిలర్లు,  కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. 

నెరవేరిన సొంతింటి కల 

సింగన్నగూడెంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో 444 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. 2021లోనే ఈ ఇండ్లు పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో ఆ ఇండ్లకు ఉన్న కిటికీలు, డోర్లు చోరీకి గురయ్యాయి. ఎవరికీ కేటాయించకపోవడంతో పడావు పడి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు టైంలో హడావుడిగా 419 లబ్ధిదారులను ఎంపిక చేశారు. మౌలిక వసతులు లేకపోవడంతో పాటు ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో వాటిల్లోకి లబ్ధిదారులు వెళ్లలేదు. కాంగ్రెస్‌‌ సర్కార్‌‌‌‌ వచ్చాక ఎమ్మెల్యే అనిల్‌‌కుమార్‌‌‌‌రెడ్డి చొరవతో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2.55కోట్లు కేటాయించింది. 120 ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడంతో లబ్ధిదారులు సోమవారం గృహప్రవేశం చేశారు.