- స్టేషన్ ముందు బాధితుల ధర్నా
కోదాడ, వెలుగు: ఆందోళనలతో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం దద్దరిల్లింది. బాధితులపై సీఐ దాడులకు నిరసనగా ప్రజా సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా, బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. సీఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు డబ్బా కొట్టును తొలగించారని, గంధం కనకమ్మ, ఆమె కూతుళ్లు, తమ్ముడు మాదల ఉపేందర్ గత శనివారం ప్రధాన రోడ్డుపై నిరసన తెలుపుతుండగా, సీఐ శివ శంకర్ నాయక్ వారిపై దాడి చేశారు. ఆయన తీరుకు నిరసనగా సోమవారం బంద్‌కు పిలుపునివ్వగా పట్టణంలోని దుకాణాలు, విద్యా సంస్థలు మూసివేశారు. అశోక్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇంటి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరంగాపురం మీదుగా ఖమ్మం క్రాస్ రోడ్, బస్టాండ్, రంగా థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది.
ఈక్రమంలో సీఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఐగా శివశంకర్ కోదాడకు వచ్చిన తర్వాత పట్టణంలో హింస, నేరాలు, దొంగతనాలు, సెటిల్మెంట్లు పెరిగాయని విమర్శించారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆగస్టు 17న కోదాడలో హిజ్రాలను జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడని తెలిపారు. పట్టణంలో ఇటీవల పట్టుబడిన150 కిలోల గంజాయి వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని, కొంత మందితో కలిసి గంజాయి అమ్మి డబ్బులు కాజేశారని ఆరోపించారు. సీఐపై ఆరోపణలను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆయన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకపోతేఈ నెల 2న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముట్టడి చేపడతామని తెలిపారు.
