బోథ్ అడవుల్లో పెద్ద పులుల అలజడి.. ఆవు, దూడపై దాడితో భయాందోళనలో ప్రజలు

బోథ్ అడవుల్లో పెద్ద పులుల అలజడి.. ఆవు, దూడపై దాడితో భయాందోళనలో ప్రజలు

బోథ్​, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్, సోనాల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో రెండు పెద్ద పులులు అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల కింద సోనాల మండలంలోని వజ్జర్, చింతల్​బోరి అటవీ ప్రాంతంలో ఓ ఆవు, లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో అటవీ సమీప ప్రాంతంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు పులిని గుర్తించేందుకు ట్రాప్​ కెమెరాలను అమర్చారు.

రెండు మండలాల్లో సంచరించేవి రెండు పులులని, ఒకటి మర్లపెల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో, మరో పులి వజ్జర్​ అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని పశువుల కాపరులు చెపుతున్నారు. మూడు నెలల కింద పులి ఈ ప్రాంతంలోకి వచ్చిన సమయంలో రెండు ఆవులను, రెండు ఎద్దులను హతమార్చింది.

ఈసారి రెండు పులులు సంచరిస్తున్నాయని తెలియడంతో గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి పశువుల కాపరులు వెళ్లవదద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పులులు సంచరించిన ప్రాంతాల్లో రాళ్లు ఎక్కువగా ఉండడంతో పాదాల ఆనవాళ్లు లభించలేదని చెబుతున్నారు. ఆవును, లేగదూడను హతమార్చింది మాత్రం పులిగా అధికారులు నిర్దారించారు.