ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సోమవారం మున్సిపల్‌కార్యాలయంలో నిర్వహించిన ఎన్నిక రసాభాసగా మారింది. వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం ముందుకు దూసుకొచ్చి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అసైండ్ భూములను ఎమ్మెల్యే పాయల్‌శంకర్ తన కుటుంబీకులు, బినామీల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని ఆరోపించారు. ఆ భూములపై విచారణ జరిపిన తర్వాతే కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ బండారి అనూష ప్రకటించారు.
మండిపడ్డ ఎంపీ, ఎమ్మెల్యే..
ఈ నేపథ్యంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్శంకర్బీజేపీ కౌన్సిలర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎజెండా కాపీ రాలేదని గతంలో కోఆప్షన్ఎన్నికను వాయిదా వేయించిన మూడు పార్టీల నేతలు.. నేడు ఓడిపోతామనే భయంతో ఎన్నికను వాయిదా వేశారని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్, ఎంఐఎంతో అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. తమ పార్టీకి 27 మంది సభ్యుల మెజారిటీ ఉందని, అందరి సంతకాలతో కమిషనర్‌కు రాతపూర్వకంగా అందజేసినట్లు పేర్కొన్నారు. హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
