కేసీఆర్.. రాజీనామా చెయ్..అసెంబ్లీకి రాని నీకు ఎమ్మెల్యే పదవెందుకు

కేసీఆర్.. రాజీనామా చెయ్..అసెంబ్లీకి రాని నీకు ఎమ్మెల్యే పదవెందుకు
  • వెయ్యి రోజుల్లో నీకు రూ. కోటీ 24 లక్షల 40 వేల జీతం
  • ప్రతిపక్ష నేత హోదాలో సెక్యూరిటీ, ఇల్లు, బుల్లెట్ ప్రూఫ్ కారు
  • ఉద్యోగి 365 రోజులు రాకుంటే డిస్మిస్ చేస్తరు
  • అసెంబ్లీకి రాని నిన్నేం చేయాలె
  • కేసీఆర్ రాజీనామా కోరుతూ ఊరూరా ఆందోళనలు చేయాలె
  • 16 మంది సీఎంలు 70 వేల కోట్ల అప్పు చేస్తే.. 
  • కేసీఆర్ ఒక్కడు చేసింది 8 లక్షల కోట్లు
  • ప్రజా ప్రభుత్వ పాలనకు వెయ్యి రోజులు పూర్తి
  • నాపై బురద చల్లేందుకు అల్లరి మూకలు బైలెల్లినయ్
  • హైడ్రాతో చెరువుల్లో కబ్జాలు తొలగిస్తున్నం.. విల్లాలు కడ్తలే 
  • అంబర్​పేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
  • మూసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని  సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసమే బతుకుతున్న నేత కేసీఆర్ అని, రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యిందన్న  సీఎం రేవంత్ రెడ్డి.. ఈ వెయ్యి రోజుల్లో తాను ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశానని చెప్పారు. 

కానీ, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం వెయ్యి రోజుల్లో కోటీ 24 లక్షల 40 వేల జీతం జీతం తీసుకున్నా.. కనీసం ఒక్కరోజైనా ప్రజల మధ్యకు రాలేదని సీఎం విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని మూసారంబాగ్‌‌లో రూ.52 కోట్లతో కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించి,  ఫొటో ఎగ్జిబిషన్‌‌ను తిలకించిన అనంతరం అంబర్ పేట మున్సిపల్‌‌ గ్రౌండ్‌‌లో బహిరంగ సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జీహెచ్‌‌ఎంసీ, మ‌‌ల్కాజ్‌‌గిరి మున్సిప‌‌ల్ కార్పొరేష‌‌న్ (ఎంఎంసీ), సైబ‌‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌‌న్ (సీఎంసీ) నూత‌‌న లోగోల‌‌ను ఆవిష్కరించారు. అనం తరం సభను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.  అసెంబ్లీకి రాని కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా 6 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌‌‌‌ రాజీనామాకు డిమాండ్‌‌ చేస్తూ బుధవారం నుంచి డివిజన్, మండల కేంద్రాల్లో ర్యాలీలు, బైక్‌‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 6న హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్కు వద్ద కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టి, కేసీఆర్ దౌర్జన్యాలు, కబ్జాలపై ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు.

నాకు, కేసీఆర్‌‌‌‌కు నందికి, పందికి ఉన్నంత తేడా.. 

ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న తనకు ప్రభుత్వ సొమ్ము తింటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌‌‌‌కు నందికి, పందికి ఉన్న తేడా ఉన్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు.‘‘పదేండ్లలో కేసీఆర్ ఏం చేశాడో.. వెయ్యి రోజుల్లో నేను ఏం చేశానో చర్చకు సిద్ధం. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి’’ అని కేసీఆర్‌‌కు సవాల్ విసిరారు. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్ కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసమే బతికారే తప్ప ప్రజా సంక్షేమం పట్టించుకోలేదని మండిపడ్డారు. 

‘వెయ్యి రోజుల్లో కేసీఆర్‌‌  కోటి 24 లక్షల 40 వేల రూపాయలు జీతం తీసుకున్నారు. ఆయనకు ఇన్నిరోజులు సెక్యూరిటీ, ఇల్లు, బుల్లెట్‌‌ ప్రూఫ్‌‌ వాహనాలు తదితర వసతుల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆయన ఒక్క రోజైనా ప్రజల కోసం పనిచేయలేదు. మనమడు ఆస్పత్రికి వెళ్తే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప ఆయన బయటకు రాలేదు’’ అని విమర్శించారు.  ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు ఉద్యోగానికి హాజరు కాకపోతే డిస్మిస్‌‌ చేస్తారని, మరి వెయ్యి రోజులు బయటకురాని కేసీఆర్‌‌‌‌ను ఏం చేయాలని ప్రశ్నించారు .

‘‘కేసీఆర్ సీఎం కాగానే కొడుకును, అల్లుడిని మంత్రులుగా చేశారు. నేను  పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని మంత్రులను చేశాను. వి. హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా చేశాను. అనిల్ యాదవ్‌‌ను ఎంపీ చేశాను. ఆయన ఎర్రబెల్లి దయాకర్‌‌ను మంత్రిని చేస్తే..  నేను అడ్లూరి లక్ష్మణ్‌‌ను మంత్రిగా చేశాను. కేసీఆర్ వెంకట్ రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే, నేను అద్దంకి దయాకర్‌‌ను ఎమ్మెల్సీ చేశాను. కేసీఆర్ తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే, నేను బలహీన వర్గాల బిడ్డ మహేశ్‌‌ గౌడ్‌‌ను పీసీసీ అధ్యక్షుడిని చేశాను. ఆయన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే.. నేను మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశాను. వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి పెట్టాను. చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిని చేశాను” అని వ్యాఖ్యానించారు. 

వెయ్యి రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలు 

తాము అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు.‘‘వెయ్యి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాం. వందేండ్ల తర్వాత బీసీ కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రధాని మోదీకి సవాల్ విసిరాం. గిగ్ వర్కర్లు, స్పోర్ట్స్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ పాలసీలు తెచ్చాం” అని పేర్కొన్నారు.  రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. వెయ్యి రోజుల్లో రైతుల కోసం 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. ‘‘రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 

పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం. రూ.36 వేల కోట్లు ఖర్చు చేసి 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రాజును చేశాం. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలు నిరంతరం కొనసాగుతాయి” అని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. గిగ్ వర్కర్లు, స్పోర్ట్స్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ పాలసీ తీసుకువచ్చామని, వెయ్యి రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)లుగా మారుస్తున్నామని చెప్పారు. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు. 

పేదల ఆరోగ్య భద్రత కోసం పెద్దపీట వేస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, యువత సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీలు తెచ్చామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సభకు వివరించారు. ‘‘హైదరాబాద్ నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం” అని వివరించారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ నది ప్రక్షాళన చేయకుండా పేదల బతుకులతో చెలగాటమాడారని సీఎం మండిపడ్డారు. 

‘‘మూసీ పక్కన పేదలు నివసిస్తే వారిని పట్టించుకోలేదు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ మూసీలో మునిగిపోతున్నాయి. తాము ఆ పనిచేస్తుంటే అడ్డు తగులుతున్నారు. బతుకమ్మ పండుగ పేరుతో ఆడబిడ్డలకు ఇచ్చిన చీరల్లోనూ కమీషన్లు మేశారు. కేసీఆర్, హరీశ్‌‌రావు, కేటీఆర్ కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు” అని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో జీతాలకూ కష్టాలే.. 

పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని,  రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌తో  రాష్ట్రాన్ని కేసీఆర్‌‌‌‌కు అప్పగిస్తే.. ఆయన హయాంలో అప్పులు ఏకంగా 8 లక్షల 11 వేల కోట్లకు చేరాయన్నారు.16 మంది సీఎంలు 70 వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్‌‌‌‌ ఒక్కడు 8 లక్షల కోట్ల అప్పు చేశాడని  మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ సొమ్మును గుంపు మందలా జమై తిన్నారని మండిపడ్డారు.  కేసీఆర్ వెయ్యి ఎకరాల్లో, కేటీఆర్‌‌‌‌ 100 ఎకరాల్లో, కవిత 50 ఎకరాల్లో ఫామ్‌‌హౌస్‌‌లు కట్టుకున్నారని, పేదల ఆత్మగౌరవమైన రేషన్ కార్డులు, ఇండ్ల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్‌‌లో రక్తదాన శిబిరం పెట్టి కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా రాలేదని, వేలాది ఉద్యోగులు ఫైనాన్స్ డిపార్ట్‌‌మెంట్‌‌కు వచ్చి ఇంటి కిరాయి కట్టుకోలేకపోతున్నామని, పీఎఫ్ బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని, ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉండేదన్నారు.  కానీ 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా మొదటి తారీఖున  క్రమం తప్పకుండా జీతభత్యాలు చెల్లిస్తున్నామని చెప్పారు. 

ఎల్‌‌బీ నగర్, వరంగల్ ఆస్పత్రులకు మహానేతల పేర్లు

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరు లను, మహానేతలను విస్మరించబోమని సీఎం పేర్కొన్నారు. ‘‘ట్యాంక్ బండ్‌‌పై సర్దార్ సర్వాయి పాపన్న, నెక్లెస్ రోడ్డులో జ్యోతిబా ఫూలే విగ్రహాలు పెట్టాం. కేసీఆర్ హయాంలో అమరవీరులను పట్టించుకోలేదు. మేం అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం” అని వెల్లడించారు.  తెలంగాణ ఉద్యమకారులు, ఆదర్శమూర్తుల సేవలను చిరస్థాయిగా నిలిపేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం ప్రకటించారు.‘‘ఎల్‌‌బీ నగర్ టిమ్స్‌‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టి గౌరవించుకుంటాం”అని ప్రకటించారు.  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు. ‘‘ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని మరింత బలపరచాలి. ప్రజలందరూ మాకు సంపూర్ణ మద్దతు అందించాలని కోరుతున్నా. అంబర్‌‌పేట సభ సాక్షిగా తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెడతామని మాటిస్తున్నా” అని స్పష్టం చేశారు. 

కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

తెలంగాణ నలుమూలల ఉన్న మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. వెయ్యి రోజుల్లో ఒక గంట కూడా ప్రజలకు సమయం ఇవ్వని ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలనే డిమాండ్ తోని అన్ని మండల కేంద్రాల్లో సైకిల్ మోటార్ల ర్యాలీ తీయండి.. తర్వాత జిల్లా కేంద్రాల్లో చేయండి.. ఆరో తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర నిరసన కార్యక్రమం తీసుకోండి.. పంది కొక్కులాగా ప్రజల సొమ్ము మెక్కి ఫామ్​హౌస్​లో పండుకుంటే అయిపోయిందా..?  ఏడో తారీఖు నాడు అసెంబ్లీ స్టార్టయితది.. వెయ్యి రోజుల్లో చేసిన కార్యక్రమాలు నీ ఎదురుగ్గా చెప్త బిడ్డా.. మీరు గుండెలు పట్టుకొని కూసోవాలె.. మీరు చేసిన పదేండ్ల పాలన.. వందేండ్ల విధ్వంసం చెప్తా.. వెయ్యి రోజుల్లో నేనేం చేసిన్నో రేపటి అసెంబ్లీలో చర్చిద్దాం.. నిజంగా నీకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా.!ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తున్నం..
హైదరాబాద్​ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. 

తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని విభజించి,  క్యూర్‌‌లో సర్వీస్ సెక్టార్, ప్యూర్‌‌లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, రేర్‌‌లో అగ్రికల్చర్ సెక్టా ర్‌‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘‘హైదరా బాద్ సిటీని, తెలంగాణను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. హైడ్రాను తెచ్చి కబ్జాల నుం చి ప్రభుత్వ ఆస్తులను విడిపిస్తున్నాం. ఇబ్రహీం పట్నం, మూసారంబాగ్‌‌లో హై లెవల్ బ్రిడ్జిలను, ఫ్రూట్ మార్కెట్లను నిర్మిస్తున్నాం” అని తెలిపారు. హైడ్రా ద్వారా భూములను కబ్జా చేస్తున్నానంటూ తనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 

బతుకమ్మ కుంటను కబ్జా కోరల్లోంచి విడిపిస్తే అది జనాలకే ఉపయోగపడ్తోంది తప్ప తాను కబ్జా చేయలేదని, వీటిని ప్రజలు గమనిం చాలని సీఎం రేవంత్​విజ్ఞప్తిచేశారు.  తనపై బుర ద చల్లడానికి కొన్ని అల్లరి మూకలు బయల్దే రాయని, చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నామే తప్ప వాటిలో విల్లాలు, ఫామ్‌‌హౌస్‌‌లు కట్టడం లేదని చెప్పారు. మూసారంబాగ్ బ్రిడ్జిపై వరద వచ్చినప్పుడల్లా అనేక మంది ప్రాణాలు పోయా యని, పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రెండేండ్లలో బ్రిడ్జి నిర్మా ణం పూర్తి చేసి ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు.