భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చివరి క్షణంలో వాటర్ ట్యాంక్లో చనిపోయిన బల్లిని గమనించడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం చుంచుపల్లి బాబు క్యాంప్ గవర్నమెంట్ హైస్కూల్లోని వాటర్ ట్యాంక్లో బల్లి పడి చనిపోయింది. దీనిని గుర్తించకుండా వంట వాళ్లు ఆ నీటితోనే మధ్యాహ్న భోజనం వండారు. మరికొంత సేపట్లో స్టూడెంట్స్ భోజనం చేయాల్సి ఉంది.
అదే టైంలో ‘స్కూల్స్ బచావో’ పేరిట ఏఐవైఎఫ్ నేతలు స్కూల్‌ను విజిట్ చేశారు. కుళ్లిన ఆలుగడ్డలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా బల్లి చనిపోయి ఉంది. ఆ నీళ్లతో వంట చేయడంపై మండిపడ్డారు. స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారని స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు. బల్లి చనిపోయిన విషయాన్ని గుర్తించకపోతే స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యే వారని తెలిపారు.
విషయం తెలుసుకున్న ఎంఈవో, స్కూల్ హెచ్ఎం వచ్చి మరోసారి అన్నం వండించి పిల్లలకు పెట్టారు. ఇదిలాఉంటే విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా నేత దుర్గారాశి వెంకన్న, కోటి అక్కడికి వచ్చి ‘ఇది మా అడ్డా, ఫొటోలు తీయొద్దు’ అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గొడవ జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ టీచర్లపై మండిపడ్డారు. మీరెట్లా ధర్నా చేస్తారంటూ ఏఐవైఎఫ్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లతో వాగ్వావాదానికి దిగారు. ఏఐవైఎఫ్ నేతలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
