సింగరేణి యాజమాన్యంతో 24 సమస్యలపై ఒప్పందాలు కుదిరాయ్: ఏఐటీయూసీ ప్రెసిడెంట్ సీతారామయ్య

సింగరేణి యాజమాన్యంతో 24 సమస్యలపై ఒప్పందాలు కుదిరాయ్: ఏఐటీయూసీ ప్రెసిడెంట్ సీతారామయ్య

కోల్​బెల్ట్/ నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో తమ సంఘం ముందుంటుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు​వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటీయూసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఆర్థిక, ఉద్యోగ, వైద్య, విద్య, సంక్షేమానికి సంబంధించిన 24 అంశాలపై సింగరేణి యాజమాన్యంతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.

13 ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న పెర్క్స్​పై ఆదాయపు పన్ను రీఫండ్​ను తాజా అగ్రిమెంట్​లో సాధించామని చెప్పారు. సహజంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించడం, సీనియర్  మైనింగ్​ సర్దార్లుగా పని చేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఫోర్​మెన్  ప్రమోషన్లు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. మారుపేర్ల సమస్యకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారని, 2012 నుంచి పెండింగ్​లో ఉన్న ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ, పెండింగ్​ క్యాడర్​ స్కీమ్​ల అమలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర 24 సమస్యలు పరిష్కరించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

తాము యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడాన్ని ఓర్వలేక టీబీజీకేఎస్  లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల నుంచి వసూలు చేసిన చందా డబ్బులు పంచుకోవడంలో టీబీజీకేఎస్​ లీడర్లు కొట్లాడుకొని జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. యూనియన్​​లీడర్ల అవినీతి, అక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోల్​బెల్ట్​ ఏరియాలో బీఆర్ఎస్​ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కేసీఆర్​కు ఫిర్యాదు చేస్తే, గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేశారని తెలిపారు. యూనియన్​ నాయకులు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్​, భీమనాదుని సుదర్శనం, సోమిశెట్టి రాజేశం, కంది శ్రీనివాస్, పెద్దపల్లి బానయ్య, ఎగ్గెటి రాజేశ్వర్​రావు పాల్గొన్నారు. శ్రీరాంపూర్  ఏరియా నస్పూర్ లోని నరసయ్య భవన్‌‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.